ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిపై రెండు రోజుల్లో ప్రకటన: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిపై రెండు రోజుల్లో ప్రకటన: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ప్రాజెక్టు ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో అంచనా మేరకు నిర్ణయం తీసుకుంటం: ఉత్తమ్
  • కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలే
  • 2019లో బీఆర్ఎస్ కట్టిన బ్యారేజీలు 2023లోనే దెబ్బతిన్నయ్
  • నిపుణుల సూచన మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ
  • బీఆర్ఎస్ లీడర్లు కావాలనే కాంగ్రెస్​పై బురద చల్లుతున్నరని మండిపాటు
  • మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌తో కలిసి ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ల పరిశీలన

నిజామాబాద్‌‌‌‌/నిర్మల్/గోదావరిఖని, వెలుగు: ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు సాగు నీరు అందించే విషయంలో రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గోదావరి పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వల గురించి తెలుసుకునేందుకే ప్రాజెక్టులను సందర్శిస్తున్నామని చెప్పారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి శనివారం ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లను సందర్శించారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతేడాది ఇదే టైంకు ఎస్సారెస్పీలో 38 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఈ సారి 27 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద, ఆయకట్టు, ఇతర అంశాలను స్టడీ చేసి సాగు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్సారెస్పీ, నాగార్జున ‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌, శ్రీశైలం, నిజాంసాగర్ రిజర్వాయర్లు ఇప్పటివరకు చెక్కు చెదరలేదని, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ 2019లో కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2023లోనే దెబ్బతిన్నాయని మండిపడ్డారు. 

బ్యారేజీలు దెబ్బతిన్న విషయం తెలిసినప్పటికీ పంపులు ఆన్ చేయాలని కేటీఆర్‌‌‌‌ కొత్త రాజకీయాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఈ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం ప్రమాదమని నేషనల్‌‌‌‌ ‌‌‌‌డ్యాం సేఫ్టీ అథారిటీ, సెంట్రల్‌‌‌‌ ‌‌‌‌వాటర్‌‌‌‌ ‌‌‌‌కమీషన్‌‌‌‌ చెప్పినప్పటికీ కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్ రావు కావాలనే కాంగ్రెస్ పై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిపుణుల సూచనలు తీసుకున్నాకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. 

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మెజార్టీ పనులు కాంగ్రెస్ హయాంలోనే పూర్తయ్యాయని, ఈ రిజర్వాయర్ ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని గుర్తు చేశారు. ఈ రిజర్వాయర్​నుంచి నీటిని పంపింగ్​చేస్తుంటే.. కాళేశ్వరం నుంచే చేస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. పలు కారణాల వల్ల సాధ్యం కాలేదన్నారు.

 వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీటిని ఎత్తిపోస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌‌‌‌సాగర్, పాలమూరు–-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 

34 నెలలుగా కాళేశ్వరం నుంచి చుక్క నీటిని ఎత్తిపోయకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే సాగునీరు అందించి 340 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ‌‌‌‌ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, డాక్టర్ సంజయ్ కుమార్, ఎంఎస్. రాజ్ ఠాకూర్, గడ్డ వినోద్, ప్రేమ్ సాగర్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

బ్యారేజీ లేకుండా పంపులు ఎట్లా నడుపుతం: మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

కన్నేపల్లి ప్రాజెక్ట్‌‌‌‌ ‌‌‌‌కట్టి ప్రజల సొమ్ము వృథా చేసిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్ రావు.. పంప్‌‌‌‌‌‌‌‌లు నడుపమని నాటకాలు ఆడుతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బ్యారేజీ లేకుండా పంప్‌‌‌‌‌‌‌‌లు నడిపి నీటిని ఎక్కడ పోయాలని ప్రశ్నించారు. రైతుల్లో అపోహలు సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు పడకుండా రైతులు నష్టపోవాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని విమర్శించారు. 

సరిగ్గా నాలుగేండ్ల కింద అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ‌‌‌‌ప్రభుత్వం గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి వచ్చిన 20 టీఎంసీల నీటిని గేట్లు ఎత్తి వృథాగా బయటకు వదిలేసిందని, తర్వాత పంప్‌‌‌‌‌‌‌‌లు నడిపినట్లు రూ.3 వేల కోట్ల కరెంట్‌‌‌‌ ‌‌‌‌బిల్లు కట్టారని, ఆ పైసలు ప్రజలవి కావా? అని ప్రశ్నించారు. నీటిపారుదల రంగంలో వేల పుస్తకాలు చదివానని చెప్పుకున్న అప్పటి సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలతో లక్షల కోట్ల రూపాయలు వృథా అయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన బ్యారేజీలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయన్నారు.

ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: శ్రీధర్ బాబు

శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను సందర్శించి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ప్రకృతి అనుగ్రహంతో మంచి వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండుతున్నాయన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరించి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీటి తరలింపు పనులు.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగమేనని, మిడ్ మానేరు, ఫ్లడ్ ఫ్లో కెనాల్​కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించినవేనన్నారు.