హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మరో భారీ అగ్ని ప్రమాదం : దేవుడి దయ వల్ల.. !

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మరో భారీ అగ్ని ప్రమాదం : దేవుడి దయ వల్ల.. !

హైదరాబాద్ సిటీ మరోసారి ఉలిక్కి పడింది. ఓల్డ్ సిటీలో జరిగిన ప్రమాదం కలకలం రేపింది. మొన్నటికి మొన్న చార్మినార్ పక్కనే ఉన్న గుల్జార్ హౌస్ లోని ఓ ఇంట్లో ప్రమాదం జరిగి.. 17 మంది చనిపోయిన ఘటన మరువక ముందే.. ఓల్డ్ సిటీ అగ్నిప్రమాదం ఉరుకులు పరుగులు పెట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడలో జీ ప్లస్ 2 బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. ఈ మేరకు 2025, మే 20వ తేదీ మంగళవారం మధ్యాహ్నం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. జీ ప్లస్ 2 బిల్డింగ్ లోని.. సెకండ్ ఫ్లోర్ చెప్పుల గోదాం ఉంది. సరుకును నిల్వ చేసుకుంటున్నారు ఆ ఫ్లోర్ లో.. అక్కడే మంటలు వచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు బటయకు తన్నుకువచ్చాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. 

ఈ బిల్డింగ్ ను చెప్పుల గోదాంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అంతా రబ్బర్ కావటంతో ఆ ప్రాంతం అంతా నల్లటి పొగ కమ్మేసింది. ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించటంతో.. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేయగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

ఈ బిల్డింగ్ పక్కనే మరో భవనం కూడా ఉంది. మంటలు అదుపు చేయటం ఆలస్యం అయితే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు స్థానికులు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు.. ఆస్తి నష్టం జరిగింది. మంటలు అదుపులోకి తెచ్చిన అధికారులు.. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నారు.