మరో రిటైర్డ్ ​ఐఏఎస్​కు రీ అపాయింట్​మెంట్​

మరో రిటైర్డ్ ​ఐఏఎస్​కు రీ అపాయింట్​మెంట్​
  • లేబర్ డిపార్ట్​మెంట్​ స్పెషల్​ సీఎస్​గా రాణి కుముదిని

హైదరాబాద్, వెలుగు: రిటైర్​అయిన మరో ఐఏఎస్​కు రాష్ట్ర ప్రభుత్వం రీ అపాయింట్​మెంట్​ ఇచ్చింది. లేబర్​ ఎంప్లాయ్​మెంట్​ ట్రైనింగ్ అండ్​ ఫ్యాక్టరీస్​ డిపార్ట్​మెంట్​కు రాణి కుముదిని స్పెషల్​ సీఎస్​ గా​మరో రెండేండ్ల పాటు కొనసాగేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు సీఎస్​ శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1988 బ్యాచ్​కు చెందిన రాణి కుముదిని పదవీ కాలం జూన్​ 30తో ముగిసింది. దీంతో అదే రోజు నుంచి ఆమె స్పెషల్​ సీఎస్​గా లేబర్​ డిపార్ట్​మెంట్​లో రెండేండ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు ఐఏఎస్​లకు ప్రభుత్వం రీ అపాయింట్​మెంట్​ ఇచ్చింది. పశుసంవర్ధక శాఖ స్పెషల్​ సీఎస్​గా అధర్​ సిన్హాకు రెండేండ్ల పాటు పోస్టింగ్ ఇచ్చింది.

ప్రొటోకాల్​ సెక్రటరీగా ఉన్న అర్విందర్​ సింగ్​ను రీ అపాయింట్​ చేసి.. రెండేండ్లు అదే హోదాలో కొనసాగిస్తోంది. మరోవైపు పోస్టింగ్​లు లేకుండా ఉన్న యువ ఐఏఎస్​లకు మాత్రం ఎలాంటి శాఖలు కేటాయించడం లేదు. ఇలా ఆరుగురు ఐఏఎస్​లు ఉన్నట్లు తెలిసింది. కాగా, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ కమిషనర్ కూడా శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఇటీవల ఆయనను రేరా చైర్మన్ గా​ప్రభుత్వం నియమించింది.  జీహెచ్​ఎంసీ కమిషనర్​​లోకేష్​ కుమార్​ను ఈసీ అడిషనల్​ సీఈవోగా నియమించింది. ఎక్సైజ్​ కమిషనర్​ సర్ఫరాజ్​ అహ్మద్​ను కూడా ప్రభుత్వం జాయింట్​ సీఈవోగా అపాయింట్​ చేసింది. దీంతో ఈ మూడు పోస్టుల్లో ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నాలుగైదు డిపార్ట్​మెంట్లు ఒక ఐఏఎస్​ కిందనే ఉంటున్నాయి. ఈసారైనా మార్పులు చేస్తారా? లేదా? అని కొందరు ఐఏఎస్​లు ఆశగా ఎదురుచూస్తున్నారు.