
న్యూఢిల్లీ: చైనీస్ ఫిన్‌టెక్ కంపెనీ యాంట్ ఫిన్, డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎంలో తన వాటా నుంచి 4శాతం వరకు విక్రయించనుంది. బ్లాక్ డీల్స్ ద్వారా జరిగే ఈ డీల్ విలువ సుమారు రూ. 2,066 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ట్రాన్సాక్షన్ కోసం షేరు ధరను రూ.809.75 గా నిర్ణయించారని, ఇది పేటీఎం ప్రస్తుత మార్కెట్ ధర కంటే 6.5 శాతం తక్కువ అని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు రూ. 544.6 కోట్ల నష్టం వచ్చింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన రూ. 550.5 కోట్ల నష్టం కంటే ఇది కొంచెం తక్కువ. వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు సోమవారం 4 శాతం పెరిగి రూ.866.35 వద్ద ముగిశాయి.