
గచ్చిబౌలి, వెలుగు: ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ ఎత్నోలాజికల్ సైన్సెస్ (ఐయూఈఏఎస్) 19వ వరల్డ్ ఆంత్రోపాలజీ పోస్ట్ కాంగ్రెస్ సదస్సు గురు, శుక్రవారాల్లో గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం నిర్వహించనుంది. ప్రస్తుత సదస్సు ఆంత్రోపాలజీ అండ్ డిజిటల్ కల్చర్స్ అంశంపై కొనసాగుతుంది. ఇందులో 25 ప్యానెళ్లు, 100కు పైగా కార్యకర్తలు, ప్లానర్లు, కన్సల్టెంట్లు, విద్యావేత్తలు పాల్గొననున్నారు.
ఆంత్రోపాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ ఎం. రోమేశ్సింగ్, కన్వీనర్, డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఆలోక్ కుమార్ పాండే, డా. నూకారపు శ్రీనివాసు కో- కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సదస్సుకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీ (ఎంఎఎన్యూయూయూ), సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సీఈఎస్ఎస్), ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ ఎండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి.