హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకు దగ్గర భారీగా వాహనాల క్యూ కనిపించింది. బంకుల్లో డీజిల్ కొరతతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాహనదారులు డీజిల్ కోసం గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. మహబూబాబాద్, బయ్యారం, గూడూరు, నెల్లికుదరు, కేసముద్రం మండలాల్లో జాతీయ ప్రధాన రహదారిపై లారీలు, ట్రాక్టర్లు భారీగా నిలిచిపోయాయి.
పెట్రోల్ బంకుల ముందు నో డీజిల్ బోర్డులను యాజమాన్యాలు ఏర్పాటు చేయడంతో డీజిల్తో నడిచే వాహనాలకు పెద్ద సమస్యే వచ్చి పడింది. పెట్రోల్ ఎక్కడో ఒక చోట దొరుకుతున్నా.. డీజిల్ కోసం మాత్రం అవస్థలు పడాల్సి వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
ఇంధన కంపెనీల నుంచి సరఫరాలో అంతరాయం, డీలర్లకు ‘నో క్రెడిట్’ విధానంతో పెట్రోల్బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 43 బంకులు ఉండగా, పలుచోట్ల డీజిల్ నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ విషయంలోనూ ఇలాగే జరుగుతుందని, స్టాక్ ఉన్నచోట భారీ క్యూలైన్లో నిలబడాల్సి వస్తుందని వాహనదారులు చెబుతున్నారు.

