ముషీరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ‘ఫార్మాసిటీ జీవో 31’ని వెంటనే రద్దు చేయాలని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కమిటీ కన్వీనర్ సరస్వతి కవుల అధ్యక్షతన జరిగిన ప్రజా నిరసన ధర్నాలో పలువురు నాయకులు పాల్గొన్నారు. హైకోర్టు స్టే విధించిన భూముల్లో ప్రభుత్వం చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేశారు.
‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో రైతుల భూములను లాక్కోవడం మానుకోవాలని, పర్యావరణానికి హాని కలిగించే ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కన్నెగంటి రవి, సంధ్య, డాక్టర్ బాబురావు, తెలంగాణ విట్టల్, సజ్జయ్య పాల్గొన్నారు.
