సివరపల్లి, గాంధీ తాత చెట్టు, పరదా వంటి సినిమాలతో ఆకట్టుకునే రాగ్ మయూర్.. మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. ‘డిజే టిల్లు’ డైరెక్టర్ విమల్ కృష్ణతో ‘అనుమాన పక్షి’అనే మూవీ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్గా రూపొందుతున్న ఈ మూవీలో మెరీన్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ హీరోయిన్ రాశి, ప్రిన్స్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. జులై 10న మూవీ థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ‘అనుమాన పక్షి’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. హీరో ప్రతి విషయాన్నీ అతిగా అనుమానించే వ్యక్తిగా కనిపిస్తూ ఆసక్తి పెంచాడు. చిన్న విషయాన్నైనా భూతద్దంలో చూసినట్లు విశ్లేషిస్తూ, అనవసర అనుమానాలతో తానే సమస్యలు క్రియేట్ చేసుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.
ముఖ్యంగా పెళ్లి నేపథ్యంలో హీరో అనుమాన స్వభావం ఎలాంటి పరిస్థితులకు దారితీసిందనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించారు. టీజర్ మొత్తం ఫన్, కన్ఫ్యూజన్ తో ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అలాగే, "కశ్మీర్ నుంచి ఫోన్‌లు వస్తున్నాయి.. ఇప్పుడేం చేయాలి?" అనే డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచి నవ్వులు పూయిస్తోంది.
మొత్తంగా టీజర్ చూస్తే, విమల్ కృష్ణ మరోసారి తన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే, ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి కో ప్రొడ్యూసర్. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
