కామన్వెల్త్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ వల్లూరి అజయ్ బాబు రజత పతకంతో మెరిశాడు. సోమవారం రాత్రి జరిగిన మెన్స్ 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో అజయ్ మొత్తం 330 (స్నాచ్ 149+ క్లీన్ అండ్ జెర్క్ 181) కేజీల బరువు ఎత్తి గేమ్స్ రికార్డు నెలకొల్పి రెండో ప్లేస్‌లో నిలిచాడు. మలేసియా లిఫ్టర్ ఎర్రీ హిదయత్ ముహమ్మద్ 331 (స్నాచ్ 149+ క్లీన్ అండ్ జెర్క్ 184) కేజీలు ఎత్తి స్వర్ణం నెగ్గాడు.
ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ ముర్రే 325 కేజీలతో బ్రాంజ్‌ను కైవసం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో హిదయత్ క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీలు ఎత్తగా, అజయ్ కూడా అంతే బరువును లేపాడు. కానీ రెండో ప్రయత్నంలో హిదయత్ ఈజీగా 184 కేజీలు ఎత్తగా అజయ్ విఫలమయ్యాడు. 2010 ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 56 కేజీల్లో కాంస్యం సాధించాడు.
