లాక్ డౌన్ తో గుజ‌రాత్ చిక్కుకున్న మ‌త్స్య‌కారుల త‌ర‌లింపు!

లాక్ డౌన్ తో గుజ‌రాత్ చిక్కుకున్న మ‌త్స్య‌కారుల త‌ర‌లింపు!

లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను సముద్రమార్గం ద్వారా తరలించాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధ‌వారం ఉదయం గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో ఈ విష‌యంపై ఫోన్ లో మాట్లాడారు. ఆయ‌న ఒప్పుకోవ‌డంతో వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు సీఎం జ‌గ‌న్.

గుజరాత్‌లోని వీరావల్‌లో దాదాపు ఐదువేల మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు చిక్కకుపోయారు. లాక్‌డౌన్‌తో వీరంతా సముద్రపు ఒడ్డున బోట్లలోనే ఉంటూ.. కుటుంబాలకు దూరంగా నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. వారం క్రితం ఒకరు, బుధవారం మరొకరు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులకు చివరిచూపు కూడా దక్కలేదు. ‘‘కడుపు నింపుకుందామంటే సరకులు లేవు… నిద్రపోదామంటే చోటేలేదు. గొంతైనా తడుపుకుందామంటే.. రోజుల క్రితం నిల్వ చేసిన నీరు తప్ప దిక్కులేదు. నీళ్లు లేక‌ నెల రోజులుగా స్నానం కూడా చేయలేదు. చావుకీ.. బతుక్కీ మధ్య నలిగిపోతున్నాం’’ అంటూ మత్స్యకారులు ఆవేదన వ్య‌క్తం చేస్తూ త‌మ‌ను ఆదుకోవాల‌ని వీడియో మెసేజ్ ద్వారా గుజ‌రాత్, ఏపీ సీఎంల‌ను కోరారు. దీనిపై స్పందించిన ఏపీ సీఎం మత్స్యకారుల పరిస్థితిపై సమీక్షించిన.. వారిని సముద్రమార్గం ద్వారా స్వ‌స్థ‌లాల‌కు ర‌ప్పించాల‌ని నిర్ణ‌యించారు.