- ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్య
- భాషా ప్రాతిపదికన ఏపీ ఏర్పడకపోయుంటే తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం అయ్యేది కాదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇన్నేండ్లయినా ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని ఆరోపించారు. శనివారం ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కూటమి సర్కార్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది . అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.‘‘అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని జనసేన తరపున సమర్థిస్తున్నాను. రాష్ట్రం విడిపోయి దశాబ్దం గడుస్తున్నా.. ఇప్పటికీ మనం రాజధాని కోసం కొట్టుకోవాల్సి రావడం అత్యంత బాధాకరం. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు.. తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక భౌగోళిక అస్తిత్వంతో ఉండేది. భాషా ప్రాతిపాదికన ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపోయుంటే తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం అయ్యేది కాదు. ఆనాడు హైదరాబాద్ స్టేట్‌లో మరాఠ్వా (మహారాష్ట్రలోని భాగం), కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి. భాషా ప్రాతిపదికన ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తెలుగు వారందరం కలిశాం. కానీ, రాష్ట్ర విభజన టైంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు.ఆ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్లే ఏపీకి తీరని అన్యాయం జరిగింది. అయితే, ఒక పక్క తెలంగాణ (హైదరాబాద్) అభివృద్ధి చెందిన రాజధానితో ఉంటే, ఏపీ మాత్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం నన్ను ఎంతో కలచివేసింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీకి ఏకైక రాజధాని అమరావతి
అమరావతి కోసం రైతులు తమ సర్వస్వాన్ని, ఇష్టపూర్వకంగా భూములను త్యాగం చేశారని పవన్ అన్నారు‘‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి విషయంలో జరిగిన అరాచకాలు అందరికీ తెలుసు. ఆనాడు వారు వేసిన ముళ్ల కంచెలను దాటుకుని, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అమరావతికి చట్టబద్ధత కల్పించుకుంటున్నాం. ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి అని మేం ఆనాడే నిర్ణయించుకున్నాం, నేడు ఆ కల సాకారమవుతోంది" అని స్పష్టం చేశారు. కాగా..అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీన్ని ఏపీ సర్కార్ త్వరలో కేంద్రానికి పంపనుంది.
