
- మన బార్డర్ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ దళారుల దందా
- ఆ రాష్ట్రంలో తక్కువకు కొని మన ఐకేపీ కేంద్రాల్లో విక్రయం
- కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కు
- మూడు రోజుల కింద హాలియా మార్కెట్‌కు ఏపీ నుంచి 50 లారీలు
- ఎంక్వైరీ ప్రారంభించిన అధికారులు.. వాడపల్లి వద్ద 7 లారీలు సీజ్
- బార్డర్లో చెక్‌పోస్టులు.. లారీలను అనుమతించాలని డ్రైవర్ల ఆందోళన
నల్గొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లపై క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తుండడంతో ఏపీకి చెందిన దళారులు దందాకు తెరతీశారు. ఆ రాష్ట్రంలో తక్కువ రేటుకు సన్నవడ్లు కొని అడ్డదారిలో లారీలను బార్డర్ దాటించి, ఇక్కడి ఐకేపీ సెంటర్లలో విక్రయిస్తున్నారు. 3 రోజుల క్రితం నల్గొండ జిల్లా హాలియా మార్కెట్ కు ఏపీ నుంచి 50 లారీలు వచ్చినట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ ప్రారంభించారు. ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే శుక్రవారం వాడేపల్లి వద్ద అధికారులు 4 లారీలను సీజ్‌చేశారు. అక్రమాలను ముందే ఊహించిన ప్రభుత్వం ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల నుంచి వడ్ల లారీలు రాకుండా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసింది. అయినప్పటికీ దళారులు అడ్డదారుల్లో తెలంగాణలో ప్రవేశిస్తున్నట్లు సివిల్సప్లై అధికారులు అనుమానిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనూ అక్రమాలు జరగకుండా రైతుల ఆధార్, పాస్‌బుక్ వివరాలు తీసుకుంటున్నారు. కానీ దళారులు, కొన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై వడ్లను నేరుగా మిల్లులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిని అడ్డుకోకపోతే రాష్ట్ర సర్కారుకు భారీ నష్టం వాటిల్లడంతోపాటు స్థానిక రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది.
చెక్‌పోస్టులను తప్పించుకుంటూ..
ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుంచి సన్నవడ్లు రాష్ట్రంలోకి చేరుతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా సరిహద్దులోని వాడపల్లి, మట్టంపల్లి మీదుగా మిర్యాలగూడ ప్రాంతానికి దళారులు పెద్దఎత్తున సన్నవడ్లు తరలిస్తున్నారు. జగ్గయ్య పేట నుంచి నేషనల్ హైవే మీదుగా కోదాడకు, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి మీదుగా చెరువు మాధారానికి వడ్ల లారీలు చేరుకుంటున్నాయి. ఇక్కడి నుంచి వివిధ మార్గాల్లో మిర్యాలగూడకు తరలిస్తున్నారు. ఏపీలోని తెనాలి, మచిలీపట్నం, పామర్రు ప్రాంతాల నుంచి కూడా తెలంగాణకు భారీగా సన్న వడ్లు వస్తున్నట్లు సమాచారం. తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తప్పించుకునేందుకు అడ్డదారుల్లో వెళ్లి.. అవి దాటాక తిరిగి హైవేలు ఎక్కుతున్నట్లు తెలుస్తున్నది. 3 రోజుల క్రితం హాలియాకు ఏపీకి చెందిన 50 లారీల సన్న వడ్లు వచ్చాయన్న సమాచారంతో సివిల్సప్లై శాఖ అలర్ట్ అయింది. అధికారులు ఎంక్వైరీ చేపట్టడంతో విషయం చర్చనీయాంశంగా మారింది.
మద్దతు ధరతో పాటు బోనస్ కొట్టేసేందుకు..
సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ. 2,320 మద్దతు ధర ఉండగా, తెలంగాణ ప్రభుత్వం రూ.500 బోనస్ కలిపి రూ.2,820 చొప్పున చెల్లిస్తున్నది. ఏపీలో వర్షాల కారణంగా వడ్లు తడిసిపోయాయి. ఇదే అదనుగా అక్కడ క్వింటాల్‌కు రూ.2వేల చొప్పున కొనుగోలు చేస్తున్న దళారులు ఆ లారీలను నేరుగా తెలంగాణ తరలించి, విక్రయిస్తున్నారు. వీరికి సెంటర్ల నిర్వాహకులు సహకరిస్తుండడంతో ఒక్కో క్వింటాల్‌కు రూ.820 చొప్పున వెనకేసుకుంటున్నారు. రైతుల ఆధార్‌కార్డులు, పాస్బుక్ల సాయంతో ట్రక్షీట్లు అందజేయడంతోపాటు అమ్ముకున్న వడ్ల పైసలు నేరుగా దళారుల అకౌంట్లలో పడేందుకు ట్యాబ్ ఎంట్రీలో రైతులకు బదులు, దళారుల అకౌంట్ నంబర్లను ఎంట్రీ చేస్తున్నట్లు తెలిసింది. దళారులతో కుమ్మక్కైన మిల్లర్లు, అక్కడి నుంచి వచ్చే లారీలనే ముందుగా అన్లోడ్ చేయిస్తున్నారు. దీనివల్ల స్థానికంగా రైతులు రోజుల తరబడి ఎదురుచూడడంతోపాటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నది.
లారీలను అనుమతించాలంటూ ఆందోళన
ఏపీ నుంచి తెలంగాణలోకి వాడపల్లి మీదిగా అక్రమంగా తరలిస్తున్న సన్న వడ్లను పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. వీటిలో 4 లారీలు, 3 డీసీఎంలను సీజ్ చేశారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ లోని అల్లూరి జిల్లా తంగెడ కృష్ణానది బ్రిడ్జిపై ధాన్యం లారీలు భారీగా నిలిచిపోయాయి. లారీలను నిలిపివేయడంతో డ్రైవర్లంతా బ్రిడ్జిపై ఆందోళనకు దిగారు. ఏపీ నుంచి వస్తున్న ధాన్యం లారీలను తెలంగాణలోకి అనుమతించాలంటూ నినాదాలు చేశారు. మరోపక్క వాడపల్లి, మట్టంపల్లి బార్డర్ లో సైతం లారీలను అనుమతించాలంటూ డ్రైవర్లు ఆందోళన చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు సర్ది చెప్పడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు.
మిగిలిన జిల్లాల్లోనూ అలర్ట్..
కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్, గుర్మిట్కల్ ప్రాంతాల నుంచి సన్నవడ్లను నారాయణపేట జిల్లాలోకి తరలిస్తున్నారు. కట్టడి చేసేందుకు తెలంగాణ–-కర్నాటక బార్డర్లో నారాయణపేట, దామరగిద్ద, మాగనూరు, కృష్ణా మండలాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, అటువైపు నుంచి వస్తున్న వడ్ల లారీలను అడ్డుకుంటున్నారు. ఇటు ఖమ్మం జిల్లాలో సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి ఖమ్మం జిల్లాలోకి ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.