
అమరావతి : అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరగకుండా చూసేందుకు బార్ కోడ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చిన్న పిల్లలు, బాలింతలకు అందించే కోడి గుడ్ల సరఫరాలో కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని.., చిన్నసైజు గుడ్లు వస్తున్నాయని, పద్ధతిగా ఓ సమయం అంటూ పాటించడం లేదనే విమర్శలు పెరిగిపోవడంతో.. ICDS.. మే నెల నుంచి బార్‌కోడ్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.
ఇప్పటికే అంగన్‌వాడీ వర్కర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఇందుకోసం ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేసి అంగన్‌వాడీ కార్యకర్తలకు అందుబాటులో వుంచారు.
కోడి గుడ్లను నెలకు మూడుసార్లు సరఫరా చేస్తారు. ఒక్కో సెంటర్‌కు నెలకు మూడు చొప్పున బార్‌కోడ్ షీట్లను అందిస్తారు. కోడిగుడ్లు అంగన్‌వాడీ సెంటర్‌కు సరఫరా కాగానే కోడిగుడ్డు ట్రేలను, బార్ కోడ్ పేపర్‌ను పెట్టి స్కాన్ చేస్తారు. దీని ద్వారా కోడిగుడ్లు అంగన్‌వాడీ కేంద్రానికి ఎప్పుడు వచ్చాయి? ఈ గుడ్లలో చిన్న సైజు గుడ్లు ఏమైనా వున్నాయా? ఇలాంటి వివరాలు మొత్తం నమోదుచేస్తారు.
ఈ వివరాలు మొత్తం సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానమై వుంటాయి. సీడీపీవోలు, పీడీలు, రాష్ట్ర అధికారులు వారి ఆఫీస్ లలో కోడిగుడ్ల పరిస్థితులను చిటికెలో తెలుసుకునే వీలు వుంటుంది. కాంట్రాక్టరు సరైన గుడ్లు సరఫరా చేయకపోయినా వెంటనే తెలిసిపోతుంది.