
మునుగోడు, వెలుగు : ఈరోజు ప్రారంభించిన భవనం పార్టీ కార్యాలయం కాదని.. మునుగోడు ప్రజల ఇల్లు అని, ఇక్కడ అందరి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో అత్యాధునిక హంగులతో నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే తన సతీమణి లక్ష్మితో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించడానికి, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి మీటింగ్ హాల్, వ్యక్తిగత సిబ్బందికి అదనపు గదులతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆధునీకరించబడిన ఈ క్యాంపు కార్యాలయం మాత్రం శాశ్వతంగా ఉంటుందన్నారు.
నియోజకవర్గలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం చర్చించడానికి ఇది ఒక వేదికగా మారుతుందని తెలిపారు. పేదల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అంశంపై నూతనంగా నిర్మించిన మీటింగ్ హాల్లో నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీబీ కుంభం శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు