- కొన్ని మున్సిపాలిటీల్లో రూ. 15 లక్షల కన్నా ఎక్కువ
- నేడు బీ ఫారాలు.. చైర్‌పర్సన్ల ఎన్నిక
- విప్ల నియామకం
యాదాద్రి జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో చైర్పర్సన్ఎన్నికకు ఒక్క ఓటు తక్కువైంది. ఇండిపెండెంట్‌తో బేరసారాలు మొదలయ్యాయి. సదరు ఇండిపెండెంట్ రూ. కోటి డిమాండ్ చేశాడు. ‘నీవు కలసి రాకుంటే.. ఇంకో కౌన్సిలర్ రావడానికి రెడీగా ఉన్నాడు నీ ఇష్టం’ అంటూ చైర్మన్ సీటు ఆశిస్తున్న వ్యక్తి స్పష్టంగా చెప్పేశాడు. చివరకు రూ. 15 లక్షలకు బేరం కుదరడంతో సదరు ఇండిపెండెంట్ కారు ఎక్కేశాడు. మరో మున్సిపాలిటీలో సరిపోనూ ఓట్లున్నాయి. అయినా సొంత పార్టీ కౌన్సిలర్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. చైర్‌పర్సన్ పదవి అశిస్తున్న కౌన్సిలర్తనకు పదవి ఓకే అయితే ఆస్తిలో కొంత భాగం అమ్మడానికి రెడీగా అయ్యాడు. ఈ మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా ఎవరిని చేయాలో ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోనున్నారు.
యాదాద్రి, వెలుగు: కౌన్సిలర్లతో బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం చైర్‌పర్సన్, వైస్చైర్పర్సన్ఎవరో తేలిపోనుంది. రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకూ ఖర్చుచేసి గెలిచిన కౌన్సిలర్లకు ఇప్పుడు డిమాండ్ చేసే అవకాశం వచ్చింది. క్యాంపుల్లో ఉన్న కౌన్సిలర్లతో చైర్‌పర్సన్ సీటు ఆశిస్తున్న వారు బేర సారాలు సాగిస్తున్నారు. సొంత పార్టీ నుంచే గెలిచిన కౌన్సిలర్లకే మున్సిపాలిటీ స్థాయిని బట్టి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ ముట్టజెప్పడానికి ఒప్పుకుంటున్నారు.
కౌన్సిలర్ల సంఖ్యను బట్టి ఒక్కో మున్సిపాలిటీలో రూ. 40 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకూ చెల్లింపులు చేయడానికి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ డబ్బు చెల్లింపులు చేయడానికి కొందరు ఆస్తులు అమ్మడానికి కూడా రెడీ అయిపోతున్నారు. వైస్ చైర్‌పర్సన్ పదవి ఆశిస్తున్న వారు కూడా కౌన్సిలర్లకు తమ వంతుగా కొంత అమౌంట్చెల్లించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
నేడు బీ ఫారాలు జారీ, చైర్పర్సన్ల ఎన్నిక
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ల ఎన్నిక జరగనుంది. మూడు మున్సిపాలిటీల్లో ఇప్పటికే చైర్‌పర్సన్లను ప్రకటించినా.. వైస్ చైర్‌పర్సన్లను ప్రకటించలేదు. చౌటుప్పల్, భువనగిరి, మోత్కూరు మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చైర్‌పర్సన్లు, వైస్‌చైర్‌పర్సన్లకు పీసీసీ ప్రెసిడెంట్బీ ఫారాలు ఇస్తారు.
వారినే ఎన్నుకోవాలని విప్ జారీ చేయనున్నారు. కాంగ్రెస్ తరఫున ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలకు డీసీసీ ప్రెసిడెంట్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మోత్కూరుకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, చౌటుప్పల్‌కు మాజీ జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, పోచంపల్లికి భారత లవకుమార్, భువనగిరికి కూర వెంకటేశ్‌కు విప్ జారీ చేసే అధికారాలు అప్పగించారు.
వివిధ ప్రాంతాల్లో క్యాంపుల్లో కొనసాగుతున్న కౌన్సిలర్లు నేరుగా బస్సులు లేదా కార్లలో మున్సిపాలిటీ వద్దకు ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తారు. అనంతరం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో పాల్గొంటారు. మోత్కూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గడ్డం స్వప్న, వైస్ చైర్‌పర్సన్‌గా పల్లెర్ల వెంకన్న ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన మొగుళ్ల అనురాధ కాంగ్రెస్ లో చేరారు.
