- ములుగు జిల్లాలో పర్యటించిన పోలీస్ బాస్
- మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సమత లొంగుబాటు
- లొంగిపోయిన 24 మంది మావోలకు రూ.కోటి 88 లక్షల రివార్డులు: డీజీపీ ఆనంద్
ములుగు/వెంకటాపురం, వెలుగు: తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం సరెండర్ పాలసీని అమలు చేస్తోందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని విరమించి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ పౌరుల్లా జీవించాలని పిలుపునిచ్చారు.
సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టలను ఆయన సందర్శించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరెండర్ పాలసీలో భాగంగా మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత అలియాస్ మాధవి, దుర్గ, షకీలా లొంగిపోయినట్లు తెలిపారు.
సమతకు రూ.20 లక్షల రివార్డుతో పాటు రూ.25 వేల తాత్కాలిక ఆర్థిక సాయం అందించారు. మరో 23 మంది వివిధ స్థాయి మావోయిస్టు కేడర్లకు రూ.1.88 కోట్ల రివార్డులను అందజేశారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడంతోపాటు ఉపాధి అవకాశాలు, అవసరమైన శిక్షణ అందిస్తామని చెప్పారు.
కర్రెగుట్టల్లో పర్యాటక అభివృద్ధి..
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాల సమన్వయంతో కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కర్రెగుట్టల గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, విద్యుత్, తాగునీరు, మొబైల్ టవర్లు వంటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మురుమూరు నుంచి పామునూరు, అక్కడి నుంచి తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని తడపల వరకు ఉన్న మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో వాచ్‌టవర్ల నిర్మాణం జరుగుతోందన్నారు. అనంతరం తడపల వద్ద డీజీపీ జాతీయ జెండాను ఆవిష్కరించి పావురాలను ఎగురవేశారు.
పామునూరు గ్రామంలోని గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని సీఆర్పీఎఫ్ 196 బెటాలియన్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లో పోలీసు, భద్రతా అధికారులతో సమావేశమై సరిహద్దు భద్రత, సమాచార మార్పిడి, సమన్వయంపై చర్చించారు.
265 మంది లొంగుబాటు..
2026లో తెలంగాణ పోలీసుల ప్రత్యేక నిఘా, సమన్వయంతో వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కీలక ఫలితాలు సాధించామని డీజీపీ తెలిపారు. ఆపరేషన్ కగార్‌కు ముందు మావోయిస్టులు ఉండేవారని, ఇప్పుడు లేరని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 265 మంది లొంగిపోయినట్లు చెప్పారు. వీరిలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 24 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 94 మంది ఏరియా కమిటీ కార్యదర్శులు, 131 మంది పార్టీ సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు.
తెలంగాణకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, రాష్ట్ర కమిటీ సభ్యులు జాడె రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగ్లు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.
మాజీ మావోయిస్టులకు హెల్త్ కార్డులు..
2024 నుంచి 2026 మధ్య లొంగిపోయిన మావోయిస్టు కేడర్లకు హెల్త్ కార్డులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. పునరావాస విధానం కింద లభించే ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తామని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న కేసుల తీవ్రతను బట్టి చర్చించి కేసుల ఎత్తివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
ఈ పర్యటనలో మల్టీజోన్1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, సీఆర్పీఎఫ్ ఏడీజీ విక్రమ్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, ములుగు కలెక్టర్ బోర్కడే హేమంత సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, డీఎఫ్‌వో వికాస్ మీనా, ఏఎస్సీ మనన్ భట్ తదితరులు పాల్గొన్నారు.
41 ఏళ్లు మావోయిస్టుగా పనిచేసిన సమత..
ఏపీలోని రాజమండ్రి ఆర్యాపురానికి చెందిన సమత 1971 నుంచి 1984 వరకు చెన్నైలో చదువుకున్నారు. ఇంటర్ మధ్యలోనే చదువు మానేసి 1985లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌లో చేరారు. 1991లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, 1994లో డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. హైదరాబాద్ నగర కమిటీతో పాటు మహబూబ్‌నగర్ నల్లమల ప్రాంతంలో పనిచేశారు. 2003లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు.
అనంతరం తూర్పు ప్రాంతీయ బ్యూరో, గోల్డెన్ కారిడార్ కమిటీ, దక్షిణ ప్రాంతీయ బ్యూరో పరిధిలో పనిచేశారు. సమత తండ్రి కాకరాల సత్యనారాయణ సినీ నటుడిగా సుమారు 300 సినిమాల్లో నటించారు. సమత 1991లో మావోయిస్టు నేత మేకల దామోదర్‌రెడ్డి అలియాస్ మదన్నను వివాహం చేసుకున్నారు. ఆయన 1997లో ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో 2000లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పటేల్ సుధాకర్‌రెడ్డి అలియాస్ సూర్యంను వివాహం చేసుకున్నారు. ఆయన 2009లో
ఎదురుకాల్పుల్లో మృతిచెందారు.
ఆపసోపాల మధ్య కర్రెగుట్టల పైకి..
కర్రెగుట్టలపైకి వెళ్లే క్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన బృందంతో పాటు పోలీసులు, జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంతో మట్టి రోడ్డు బురదమయంగా మారడంతో వాహనాలు ఎక్కడికక్కడ దిగబడిపోయాయి. పోలీసుల వాహనాలు సైతం బురదలో చిక్కుకోవడంతో సిబ్బంది వెనుక నుంచి తోసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. డీజీపీ కాన్వాయ్‌లోని ఓ వాహనం కూడా బురదలో చిక్కుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.
