తిర్యాణి మండలంలో ఫారెస్ట్ ఆఫీసర్లకు చిక్కిన టేకు స్మగ్లర్

తిర్యాణి మండలంలో ఫారెస్ట్ ఆఫీసర్లకు చిక్కిన టేకు స్మగ్లర్
  • వెంబడించి పట్టుకున్న అధికారులు

తిర్యాణి, వెలుగు: తిర్యాణి అటవీ ప్రాంతం నుంచి కలపను అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని ఫారెస్ట్ ఆఫీసర్లు ఛేజ్​ చేసి పట్టుకున్నారు. తిర్యాణి రేంజర్ శ్రీనివాస్ వివరాలు ప్రకారం.. తిర్యాణి మండలంలోని అటవీ ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. మండలానికి చెందిన ఏలేశ్వరం తిరుపతి కలపను ఆసిఫాబాద్ కు తరలిస్తుండగా మాటువేసి పట్టుకున్నారు. ఆసిఫాబాద్​లోని శ్రీ వైభవ్ టింబర్ డిపోలో ఫర్నిచర్ తయారీకి స్మగ్లింగ్ చేస్తున్నామని, తనకు అజ్మీర గణపతి సహకరించినట్లు ఒప్పుకున్నాడు. కలపతోపాటు స్మగ్లింగ్ కు వాడే కారును సీజ్ చేసి తిర్యాణి రేంజ్ కు తరలించామని రేంజర్​తెలిపారు. 

పట్టుకున్న టేకు కలప విలువ రూ.46,665 ఉంటుందని చెప్పారు. తిరుపతితోపాటు గణపతిపై కేసు ఫైల్​చేశామని, తిరుపతిని ఆసిఫాబాద్​కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఎంవీ రమేశ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. గణపతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో డిప్యూటీ రేంజర్ మోహినుద్దీన్, సెక్షన్ ఆఫీసర్లు విజయ్ ప్రకాశ్, మహేందర్, బీట్ అఫీసర్లు అనిల్, ప్రకాశ్, శ్రీకాంత్, సాధిక్ పాల్గొన్నారు.