మాజీ సైనికులు.. సమరయోధుల భూములకు క్లియరెన్స్ ఇస్తలే...

మాజీ సైనికులు.. సమరయోధుల భూములకు క్లియరెన్స్ ఇస్తలే...
  • రెండున్నరేండ్లుగా నిలిచిపోయిన ఎన్‌‌ఓసీల జారీ
  • సీసీఎల్‌‌ఏలో 700కు పైగా, జిల్లాల్లో వందలాది ఫైళ్ల పెండింగ్‌‌
  • అప్రూవల్స్ ఇవ్వొద్దంటూ కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు
  • హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కోట్లలో భూముల రేట్లు
  • కుటుంబ అవసరాలకు అమ్ముకోలేక లబ్ధిదారుల కష్టాలు
  • ఎన్‌‌వోసీలు ఇప్పిస్తామంటూ రంగంలోకి దళారులు

హైదరాబాద్​, వెలుగు: మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులకు కేటాయించిన భూముల క్రయ, విక్రయాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం లేదు.  దశాబ్దాల కింద అసైన్డ్ చేసినప్పటికీ కీలకమైన ఎన్‌‌ఓసీల జారీ ప్రక్రియ గత రెండున్నరేండ్లుగా పూర్తిగా పెండింగ్‌‌ పడింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వందల సంఖ్యలో లబ్ధిదారులు పెట్టుకున్న అప్లికేషన్లకు మోక్షం లభించక ఆయా కార్యాలయాల్లో మూలుగుతున్నాయి.  

ఇంకోవైపు అన్ని రిపోర్టులు వచ్చి.. సీసీఎల్ఏలోనూ 700కు పైగా అప్లికేషన్లు పేరుకుపోయాయి. నిబంధనల ప్రకారం ఫైళ్లు సిద్ధం చేసినప్పటికీ, పైస్థాయి నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. ఎన్‌‌ఓసీలు మంజూరు చేయవద్దంటూ కలెక్టర్లకు సైతం ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తున్నది.  ఈ జాప్యం కారణంగా వృద్ధాప్యంలో ఉన్న ఎక్స్ సర్వీస్‌‌మెన్, ఫ్రీడమ్ ఫైటర్స్, వారి వారసులు తమ అవసరాలకు భూములను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ భూములకు పెద్దగా విలువలేని కాలంలో  ప్రభుత్వాలు వీరికి సాగు కోసం పంపిణీ చేశాయి. ప్రస్తుతం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఎకరం కోట్ల రూపాయలు పలుకుతుండటంతో ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీల ముసుగులో దందా మొదలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కోట్ల విలువ.. దళారుల కన్ను

హైదరాబాద్ మహానగర విస్తరణతో చుట్టుపక్కల జిల్లాల్లోని భూముల ధరలు అనూహ్యంగా పెరగడమే ఈ ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీల సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌లాంటి జిల్లాల్లోని మాజీ సైనికుల భూములకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. మార్కెట్లో ఎకరం  కోట్ల రూపాయలకు చేరడంతో ఈ భూముల కొనుగోలుపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడిదారులు దృష్టి సారించారు. 

ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీల కోసం కొందరు మధ్యవర్తులు రంగంలోకి దిగి దందాకు తెరతీస్తున్నట్టు విమర్శలున్నాయి.  అదే సమయంలో తక్కువ ధరకే అగ్రిమెంట్లు చేసుకొని ఫైళ్లను క్లియర్ చేయించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా ఎక్కువ కాలం పెండింగ్​ పెడితే మధ్యవర్తుల బెడద మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది.  ఈ క్రమంలో  అర్హులైన మాజీ సైనికులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనం దళారుల పాలయ్యే ప్రమాదం ఉంది.

అనుమతుల కోసం ఏండ్లుగా ఎదురుచూపులు

ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీల కోసం దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల నుంచి సీసీఎల్ఏ చేరుకున్నా అక్కడ ముందడుగు పడడం లేదు. అదే సమయంలో తక్కువ మార్కెట్ వాల్యూ ఉన్న భూములకు కలెక్టర్​ లెవెల్‌‌‌‌‌‌‌‌లో ఇవ్వాల్సిన అప్రూవల్స్​ కూడా పెండింగ్​పడ్డాయి. అన్ని ధ్రువపత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ కావాలని పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంచుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిఖితపూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతోనే కింది స్థాయి సిబ్బంది ఈ ఫైళ్లు పక్కనపెడ్తున్నారనే ఆరోపణలున్నాయి. 

రెండున్నరేండ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో లబ్ధిదారులు తమ ఫైళ్ల పరిస్థితి తెలుసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్లు సైతం ఈ అసైన్డ్ భూముల ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీల ఫైళ్లపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోసం నిరీక్షిస్తున్నారు. పరిపాలనాపరమైన ఈ జాప్యం వల్ల, దేశానికి సేవలందించిన మాజీ సైనికులు, సమరయోధులకు సకాలంలో న్యాయం జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వందలాది దరఖాస్తులను పరిష్కరించడానికి రెవెన్యూ శాఖ దగ్గర నిర్దిష్టమైన ప్రణాళిక గానీ, కాలవ్యవధి గానీ లేకపోవడం గమనార్హం. 

అమ్ముకునే హక్కున్నా.. ఆదుకోని ఆస్తులు

దేశ రక్షణ కోసం సేవలు అందించిన మాజీ సైనికులకు, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రభుత్వాలు వ్యవసాయ భూములను కేటాయించడం  గతంలో ఆనవాయితీగా ఉండేది. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు ఐదెకరాల మెట్ట (మెరక) భూమి లేదా రెండున్నరెకరాల మాగాణి (తరి) భూమిని ప్రభుత్వాలు పంపిణీ చేసేవి. దశాబ్దాల క్రితం పట్టణాలకు దూరంగా, ఎలాంటి సాగు సదుపాయాలు లేని బంజరు, ఇతర  భూములను వీరికి అసైన్డ్ రూపంలో అందించారు. లబ్ధిదారులు తమ సొంత ఖర్చులతో, శ్రమతో ఆ భూములను చదును చేసుకుని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, భూమి కేటాయించిన పదేండ్ల తర్వాత దానిని అమ్ముకునేందుకు లేదా బదిలీ చేసుకునేందుకు వీరికి పూర్తి హక్కు ఉంటుంది. 

ఈ హక్కును వినియోగించుకొని రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే రెవెన్యూ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీ) పొందడం తప్పనిసరి. ప్రస్తుతం వయోభారంతో ఉన్న చాలా మంది మాజీ సైనికులు, సమరయోధుల వారసులు.. తమ కుటుంబ అవసరాల కోసం ఈ భూములను విక్రయించే ప్రయత్నంలో ఉన్నారు. 

పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, వైద్య ఖర్చుల కోసం భూములు అమ్ముకుందామనుకున్న వారికి ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీల నిరాకరణ పెద్ద అవరోధంగా మారింది. దీంతో తాము దేశానికి చేసిన సేవలను  గౌరవించి, వారి దరఖాస్తులను తక్షణమే పరిశీలించి పారదర్శకంగా క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వాలని పలువురు మాజీ సైనికులు, సమరయోధులు కోరుతున్నారు.