పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ పర్యటన సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారు. ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పినట్లుగానే మెడికల్ కాలేజీకి మూడు బస్సులను అందజేశారు.
శుక్రవారం (మార్చి 6) మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంపీ ల్యాడ్స్ (MPLADS) నిధులతో కొనుగోలు చేసిన బస్సులను అధికారికంగా కాలేజీకి అప్పగించారు. మొత్తం రూ.80 లక్షల వ్యయంతో మూడు బస్సులను కొనుగోలు చేసి విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కోసం అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ..“విద్య మన హక్కు.. విద్య ద్వారానే మన భవిష్యత్ నిర్మితమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోంది. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోంది” అని పేర్కొన్నారు.
మంచిర్యాల మెడికల్ కాలేజీని గతంలో సందర్శించినప్పుడు విద్యార్థులు ట్రాన్స్‌పోర్ట్ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు మూడు బస్సులను అందజేసినట్లు ఎంపీ తెలిపారు. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్,కాలేజీ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
