
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నామని, దీనిని జీర్ణించుకోలేక కేసీఆర్ ప్రభుత్వం ఏమి చేయడం గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. బుధవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతు బీమా, రుణమాఫీ, రూ.500 బోనస్ బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకుంటే పోలీసులతో అరెస్ట్ చేయించిన ఘనత మీదని గుర్తు చేశారు. పేదలకు సన్నబియ్యం ఇచ్చి విప్లవాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. రూ 9 వేల కోట్లతో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. కుల గణన చేసిన ఘనత తమదేనన్నారు. ఏఎంసీ చైర్మన్ రమణారావు, కోటయ్య, హబీబ్, శ్రీనివాసులు, నిజాం పాల్గొన్నారు.
కల్వకుర్తి: ధరణితో ఇబ్బంది పడిన రైతులు కొత్తగా వచ్చిన భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకొని పరిష్కరించుకోవాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సూచించారు. వెల్దండ మండలం రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ గురుకులం కోసం 25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే కేటాయించారని తెలిపారు. నాల్గవ తరగతి నుంచి ఇంటర్ వరకు 2,600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ బాలాజీసింగ్ పాల్గొన్నారు.