ఉద్యోగం ఉండాలంటే ఏఐ టూల్స్ నేర్వాలె... కొత్త స్కిల్స్ పై ఫోకస్ చేయాలి: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో నిపుణులు

ఉద్యోగం ఉండాలంటే  ఏఐ టూల్స్ నేర్వాలె... కొత్త స్కిల్స్ పై ఫోకస్ చేయాలి: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో నిపుణులు
  • నిరంతరం నేర్చుకోవాల్సిందే.. 

న్యూఢిల్లీ:   ఏఐ అనివార్యమని, దానిని నేర్చుకోకపోతే వెనుకబడిపోతామని టెక్నికల్​ఎక్స్‌‌‌‌పర్టులు స్పష్టం చేశారు. ఢిల్లీలో సోమవారం మొదలైన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో వాళ్లు మాట్లాడుతూ, ఏఐపై ఉద్యోగులు ఆందోళన చెందకుండా కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలని కోరారు.  రాబోయే మూడు నెలల్లో కనీసం మూడు ఏఐ టెక్నాలజీలు నేర్చుకోవాలని ఇన్ఫో ఎడ్జ్ ఫౌండర్​ సంజీవ్ బిఖ్ చందానీ యువతకు సూచించారు. 

గతంలో బ్యాంకులలో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆందోళనలే ఉండేవని గుర్తు చేశారు. ఆ సమయంలో ఉత్పాదకత పెరిగిందే తప్ప ఉద్యోగాలు పోలేదని వివరించారు.  ఎడ్జ్ వెర్వ్ సీఈఓ సతీష్ మాట్లాడుతూ, నిరంతరం నేర్చుకోవడం ద్వారానే ఏఐ మార్పులను తట్టుకోగలమని చెప్పారు. ఏఐ వల్ల కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని.. అంతిమంగా పనికి బాధ్యత వహించేందుకు మనుషులు అవసరమని పేర్కొన్నారు. 

‘‘ఏఐ వల్ల 50 శాతం పాత ఉద్యోగాలు పోయినా, సమానంగా కొత్త అవకాశాలు వస్తాయి. వాటికి అవసరమైన నైపుణ్యాలను గుర్తించి నేర్చుకుంటే ఉద్యోగానికి ఇబ్బంది ఉండదు. రాబోయే 3–5 ఏళ్లలో పని విధానం చాలా మారుతుంది. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి’’ అని సంపర్క్ ఫౌండర్ చైర్మన్ వినీత్ నాయర్ వివరించారు. 

ఇది ఏఐ మహాకుంభ్: మంత్రి జితిన్​ ప్రసాద

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద ఏఐ మహాకుంభ్ గా అభివర్ణించారు. ప్రపంచం మొత్తం ఈ సదస్సు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్ ఏఐ రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా మారుతోందని అన్నారు. కార్యక్రమంలో సుమారు 100 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్‌‌ఏఐ సామ్ ఆల్ట్ మన్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు.

ఏఐతో ఉద్యోగాల్లో పెను మార్పులు వస్తాయి.  రాబోయే మూడేళ్లలో ఏఐ రంగం 100 రెట్లు వృద్ధి చెందుతుంది.  పాత ఉద్యోగాల స్వరూపం మారి కొత్త అవకాశాలు పుట్టు కొస్తాయి. ఏఐ వాడకం పెరగడం వల్ల ఉత్పాదకత మెరుగుపడుతుంది.   - మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్