- దేశవ్యాప్తంగా 12 మందికి 100 పర్సంటైల్.. అందరూ అబ్బాయిలే
- అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు స్టూడెంట్స్
- జేఈఈ మెయిన్-2026 సెషన్ 1 ఫలితాలు విడుదల
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్–-2026 -(సెషన్1) ఫలితాల్లో తెలుగు స్టూడెంట్స్ సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు విద్యార్థులు100 పర్సంటైల్ సాధించారు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లోని బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-–1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే100 పర్సంటైల్ సాధించారు. ఇందులో తెలంగాణకు చెందిన వివన్ శరద్ మహేశ్వరీ ఉండగా, ఏపీకి చెందిన నరేంద్రబాబుగారి మహిత్, పాశల మోహిత్ కూడా 100 పర్సంటైల్ స్కోర్ చేశారు. వీరిలో నరేంద్రబాబుగారి మహిత్ దేశవ్యాప్తంగా ఓబీసీ కేటగిరీ టాపర్‌గా, ఏపీకి చెందిన దేవ శ్రీవిద్(99.99 పర్సంటైల్) ఎస్సీ కేటగిరీ టాపర్‌గా నిలిచారు. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు రికార్డు స్థాయిలో 13,55,293 మంది రిజిస్టర్ చేసుకోగా.. 13,04,653 మంది (96.26%) హాజరయ్యారు. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎన్‌టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సీసీటీవీ సర్వైలెన్స్, ఏఐ టెక్నాలజీ, 5జీ జామర్లను వినియోగించింది.
అయినా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు గుర్తించిన 68 మంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేసింది. మొత్తంగా 12 మంది టాపర్లలో రాజస్థాన్ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరు ఉండగా, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. ఈసారి 100 పర్సంటైల్ సాధించిన 12 మంది కూడా అబ్బాయిలే కావడం గమనార్హం. మరోపక్క బాలికల విభాగంలో హర్యానాకు చెందిన ఆషి గ్రేవాల్ 99.9969766 స్కోరుతో దేశవ్యాప్తంగా టాపర్‌గా నిలిచింది. కాగా, సెషన్ -2 పరీక్షల తర్వాత తుది ర్యాంకులను ప్రకటిస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది.
వెబ్ సైట్లో ఫైనల్ కీ
జేఈఈ సెషన్ 1 ఎగ్జామ్స్ ఫైనల్కీని సోమవారం ఉదయం ఎన్‌టీఏ రిలీజ్ చేసింది. సాయంత్రం రిజల్ట్ విడుదల చేసింది. https://jeemain.nta.nic.in వెబ్ సైట్లో ఫైనల్ కీతో పాటు రిజల్ట్‌ను ఉంచారు. మెయిన్ స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్ 1కి హాజరైన విద్యార్థులు
కేటగిరీ జనరల్ ఈడబ్ల్యూఎస్ఓ బీసీ ఎస్సీ ఎస్టీ మొత్తం
అమ్మాయిలు 1,57,747 52,904 1,80,476 43,998 14,443 4,49,568
అబ్బాయిలు 2,95,078 1,08,054 3,36,860 85,904 29,189 8,55,085
మొత్తం 4,52,825 1,60,958 5,17,336 1,29,902 43,632 13,04,653
