గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ అండ...కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు: రాహుల్ గాంధీ

గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ అండ...కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు: రాహుల్ గాంధీ
  •     అదే బాటలో తెలంగాణ కూడా చట్టాలు రూపొందిస్తున్నది
  •     గిగర్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులో భేటీ
  •     తమ ప్రభుత్వాలు దేశ వ్యాప్త నమూనాలను అభివృద్ధి చేస్తున్నాయని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్ల కోసం దేశవ్యాప్తంగా అమలు చేయగల నమూనా చట్టాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల శ్రమ దోపిడీపై ఆ వర్కర్లు, వారి సమస్యలపై పనిచేస్తున్న స్వచ్చంధ సంస్థల ప్రతినిధులతో సోమవారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి తన ఫేస్ బుక్ హ్యాండిల్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. 

గిగ్ వర్కర్లకు సంబంధించి దేశ వ్యాప్తంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు రాహుల్ కు విన్నపించుకున్నారు. కస్టమర్ తప్పులను పరిగణనలోకి తీసుకోకుండా వారిచ్చే కంప్లైంట్స్ నే గిగ్ కంపెనీలు పట్టించుకుంటాయని పేర్కొన్నారు. కనీసం సెలవులు కూడా తీసుకునే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘కోడ్ ఆన్ సెక్యూరిటీ’ చట్టాన్ని తెచ్చిందని, ఇది కేవలం గిగ్ వర్కర్లకు సెక్యూరిటీ స్కీం మాత్రమే ఇస్తుందని.. చట్టాన్ని అమలు చేయలేదని ప్రతినిధులు తెలిపారు. 

కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మొదట రాజస్తాన్, తర్వాత కర్నాటక ప్రభుత్వాలు గిగ్ వర్కర్ల కోసం చట్టాలు తెచ్చాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా గిగ్ వర్కర్ల కోసం చట్టాలు రూపొందిస్తున్నదని తెలిపారు. అలాగే, గృహ కార్మికుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పరిస్థితిని రాహుల్ అడిగి తెలుసుకున్నారు. ఇందులో వంట అవసరాల కోసం పెద్ద సంఖ్యలో బీసీ సామాజిక వర్గం కార్మికులు ఉన్నారని మరో ప్రతినిధురాలు వివరించారు. 

దళితులను వంట రూంలోకి అనుమతించరని.. వాళ్లు కేవలం బాత్ రూం క్లీనింగ్, ఇతర విభాగాల్లోనే పని చేయాల్సిన దుస్థితి ఉందన్నారు. ఇందులో 80 శాతం దళిత, 16 శాతం గిరిజన సామాజిక వర్గానికి చెందిన వర్కర్లు ఉన్నారని వివరించారు. మరీ ముఖ్యంగా మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ఒక మహిళా గిగ్ వర్కర్ రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం వాష్ రూంలు, తాగేందుకు నీరు కూడా ఉండదన్నారు. దాదాపు 16, 18 గంటలకు పని చేసినా.. కనీసం రూ.700–800 లు రావడం లేదన్నారు. కాగా, దళితులను, గిరిజనులను దూరంగా పెట్టడం నిజంగా కుల వివక్షే అని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.  

గిగ్ వర్కర్ల పోరాటం ఉపాధి కోసమే కాదు..

గిగ్ వర్కర్ల పోరాటం కేవలం ఉపాధి కోసమే కాదని, ఇది గౌరవం, భద్రత, సామాజిక న్యాయం కోసమని రాహుల్​అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గిగ్ కార్మికుల సామాజిక భద్రత, కనీస వేతనాలు, సమానత్వం అందుబాటులో ఉండేలా హక్కుల ఆధారిత చట్టాలపై పనిచేస్తున్నాయన్నారు. కొద్ది రోజుల క్రితం జన్ సంసద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిగ్ కార్మికుల ప్రతినిధి బృందాన్ని కలిసినట్టు రాహుల్​గుర్తు చేశారు. ఇందులో గిగ్ వర్కర్లు ఆర్థికంగా ప్రయోజనాలను పొందేలా బలమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వ చర్య అవసరమన్న స్పష్టత వచ్చిందన్నారు. 

అలాగే, సోమవారం నాటి మీటింగ్​లో గిగ్ కార్మికులకు స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత, వైద్య సంరక్షణ, బీమా వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పన అవసరం అనేది స్పష్టమైందని చెప్పారు. ‘‘కేంద్రంలోని మోదీ సర్కార్, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు. బలమైన చట్టాలు లేవు. సామాజిక భద్రత లేదు. గిగ్ కంపెనీలకు జవాబుదారీతనం లేదు’’ అని మీటింగ్ వీడియోతో పాటు ఫేస్ బుక్ లో పలు అంశాలను రాహుల్ రాసుకొచ్చారు.