ఇయాల్నే (ఫిబ్రవరి 16) మేయర్, చైర్ పర్సన్ ఎన్నిక

ఇయాల్నే (ఫిబ్రవరి 16) మేయర్, చైర్ పర్సన్ ఎన్నిక
  •      మహబూబ్​నగర్​ మేయర్​ ఎవరనేది ఇంకా వీడని సస్పెన్స్​
  •      మిగతా మున్సిపాల్టీల్లో చైర్​పర్సన్​ క్యాండిడేట్ల దాదాపు ఓకే..
  •      నేడు క్యాంపుల నుంచి నేరుగా ఆఫీసుల వద్దకు రానున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

మహబూబ్​నగర్​, వెలుగు : మున్సిపల్, కార్పొరేషన్​ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడంతా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్​పర్సన్, వైస్​ చైర్​పర్సన్​లు ఎవరు అనే దానిపై ప్రజల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకున్న మున్సిపాల్టీల్లో దాదాపు చైర్మన్లు ఎవరనేది స్పష్టం చేయగా, మహబూబ్​నగర్​ కార్పొరేషన్​లో మాత్రం మేయర్​ పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కార్పొరేటర్లంతా ఇంకా క్యాంపులోనే ఉండగా, సోమవారం ఉదయం హై కమాండ్​ నుంచి వచ్చిన సీల్డ్​ కవర్​ లోకి మేయర్​ పేరును ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. 

37 మంది బలంతో..

మహబూబ్​నగర్​ కార్పొరేషన్​లోని 60 డివిజన్​లకు ఎన్నికలు జరుగగా 29 స్థానాల్లో కాంగ్రెస్​, 15 స్థానాల్లో బీఆర్​ఎస్​, ఎనిమిది స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో ఎంఐఎం, ఐదు చోట్ల ఇండిపెండెంట్​ కార్పొరేటర్లు గెలుపొందారు. మేయర్​ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మ్యాజిక్​ ఫిగర్​ 31 స్థానాలు కావడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఇతరుల మద్దతు అవసరం కావడంతో కాంగ్రెస్​ తన కార్పొరేటర్లను శిబిరాలకు తరలించింది. 

రెండు రోజుల కిందట ఇండిపెండెంట్​ కార్పొరేటర్​ ఒకరు మాజీ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. మరో నలుగురు ఇండిపెండెంట్లు, ముగ్గురు ఎంఐఎం కార్పొరేటర్లు కాంగ్రెస్​కు మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్​కు 36 మంది సభ్యుల బలం చేకూరింది. 

ముందుస్తుగా పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి కూడా ఎక్స్​- ఆఫీషియో ఓటు కోసం అప్లికేషన్​ పెట్టుకున్నారు. కీలక దశ వస్తే ఈయన ఓటు హక్కును వినియోగించుకొని మేయర్​ పీఠాన్ని దక్కించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్​ ముదిరాజ్​ ఆదివారం రాత్రి  విప్​జారీ చేసినట్లు తెలిసింది. క్యాంపులో ఉన్న కార్పొరేటర్లంతా సోమవారం ఉదయం పదిన్నర గంటల నుంచి 11 గంటల వరకు కార్పొరేషన్​ ఆఫీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

కల్వకుర్తిలో స్పష్టత..  కొల్లాపూర్, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో సస్పెన్స్

నాగర్‌‌‌‌కర్నూల్ : నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో చైర్​ పర్సన్ ఎన్నికల పర్వం చివరి అంకానికి చేరింది. కల్వకుర్తి మున్సిపల్ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌గా 7వ వార్డు కౌన్సిలర్ బృంగి రత్నమాల పేరును ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఖరారు చేయడంతో అక్కడ లైన్ క్లియర్ అయ్యింది. అయితే వైస్ చైర్​పర్సన్ పదవి కోసం షానవాజ్ ఖాన్, పసుల లలిత, ఎజాజ్ మధ్య పోటీ నెలకొంది. మరోవైపు, కొల్లాపూర్‌‌‌‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​ రెడ్డి తమ మనసులో మాటను బయటపెట్టకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 

కొల్లాపూర్ చైర్​ పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా, వైస్ చైర్​ పర్సన్ రేసులో నరసింహారావు పేరు వినిపిస్తోంది. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో తీగల సునేంద్ర, సంతోష్ గౌడ్, నిజామోద్దీన్ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అభ్యర్థుల పేర్లను నేరుగా మున్సిపల్ కార్యాలయంలో సీల్డ్ కవర్ల ద్వారా ప్రకటించే అవకాశం ఉంది.

వనపర్తిలో నాలుగు చోట్ల కాంగ్రెస్​ కైవసం.. అమరచింతలో ప్రయత్నం..

 వనపర్తి : వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నాలుగింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జిల్లా కేంద్రమైన వనపర్తిలో చైర్‌‌‌‌ పర్సన్ పదవికి ఎస్ఎల్ఎన్ రమేశ్​భార్య మాధవి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కొత్తకోటలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వగా, ఆత్మకూరులో నాగమణి, జుబేదా బేగంల మధ్య పోటీ నెలకొంది. 

పెబ్బేరులో కాంగ్రెస్‌‌‌‌కు మెజార్టీ ఉన్నప్పటికీ, చైర్​ పర్సన్ అభ్యర్థిత్వం కోసం అక్కి సుశీల శ్రీనివాస్ గౌడ్, సుమిత్ర ఎల్లారెడ్డి, పర్వీన్ షకీల్‌‌‌‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇదే తరుణంలో బీఆర్ఎస్ కూడా అక్కడ పావులు కదుపుతుండటంతో రాజకీయం వేడెక్కింది. ఇక అమరచింతలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో, ఇతర సభ్యుల మద్దతుతో పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

సమీకరణాల వేళ.. గద్వాల, అలంపూరులో పోరు

గద్వాల  : గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్లు, ఎంఐఎం మద్దతుతో పాటు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ మల్లు రవిల ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి మొత్తం 21 ఓట్ల బలంతో పీఠాన్ని దక్కించుకోనుంది. ఇక్కడ లలితమ్మ, వేద‌‌‌‌వతి, జయలక్ష్మిలలో ఒకరు చైర్‌‌‌‌ పర్సన్ అయ్యే అవకాశం ఉంది. అలంపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సమాన స్థానాలు సాధించగా, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో బీఆర్ఎస్ అభ్యర్థి జయరాముడు చైర్​ పర్సన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు కాంగ్రెస్‌‌‌‌కు మద్దతు తెలపడంతో అక్కడ మంజుల చైర్‌‌‌‌ పర్సన్ కానున్నారు. ఐజలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ ఉండటంతో సీఎం సురేశ్​ ఎన్నిక లాంఛనం కానుంది. కాగా, గద్వాల ఎమ్మెల్యే విప్ విషయంలో నెలకొన్న సాంకేతిక పరమైన వివాదం చర్చనీయాంశంగా మారింది.

నారాయణపేట, మద్దూరులో కొనసాగుతున్న ఉత్కంఠ

నారాయణపేట/మద్దూరు/మక్తల్ : నారాయపేట మున్సిపాల్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మున్సిపాల్టీలో 24 వార్డులుండగా మ్యాజిక్​ ఫిగర్​ 13. ఎన్నికల్లో బీజేపీకి 11, కాంగ్రెస్​కు ఏడు, బీఆర్​ఎస్​కు నాలుగు, ఎంఐఎంకు రెండు, ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్ (ఏఐఎఫ్​బీ)​కు ఒకటి, ఇండిపెండెంట్​ ఒకరు గెలిచారు. ఇందులో ఇండిపెండెంట్​ బీజేపీ రెబల్​గా పోటీ చేసి గెలువగా, శనివారం తిరిగి బీజేపీ గూటికి చేరారు. రెండు రోజులుగా కాంగ్రెస్​ శిబిరంలో ఉన్న ఏఐఎఫ్​బీ కౌన్సిలర్​ ఆదివారం నారాయణపేటలో ప్రత్యక్షం అయ్యారు.  దీంతో ఒకవేళ బీజేపీకి మద్దతు లభిస్తే ఆ పార్టీలోని మంజుల చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.  

మరోవైపు మద్దూరు మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ‘లోకల్ వర్సెస్ నాన్ లోకల్’ వివాదం ముదిరింది. సరస్వతి, జీడి మౌనిక, గడ్డమీది గోవింద్ పేర్ల కోసం స్థానిక కేడర్ పట్టుబడుతుండటంతో ఈ అంశం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఇక మక్తల్‌‌‌‌లో వలస నాయకులకు కాకుండా సీనియర్లకే చైర్​పర్సన్​పీఠం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించగా, దేవరకద్ర చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌గా కొండ దమయంతి, వైస్ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌గా జే.అరుణ, కోస్గి చైర్​ పర్సన్ అభ్యర్థిగా నాగులపల్లి నరేందర్ పేర్లు ఖరారయ్యాయి.

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

గతేడాది జనవరి 26 తర్వాత మున్సిపల్​ పాలక వర్గాలకు గడువు ముగిసింది. దాదాపు ఏడాది పాటు ఈ మున్సిపాల్టీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగింది. ఇటీవల ఈ మున్సిపాల్టీలకు, కొత్తగా ఏర్పాటైన మహబూబ్​నగర్​ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి కావడంతో, ఎన్నికల షెడ్యూల్​ ప్రకారం సోమవారం కొత్త పాలక వర్గాలు కొలువు దీరనున్నాయి. 

ఈ నేపథ్యంలో ఆఫీసర్లు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, చైర్​పర్సన్​, వైస్​ చైర్​పర్సన్​, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఆయా చోట్ల కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు​, ఆర్డీవోలు, వీరు అందుబాటులో లేకుంటే ఆయా మున్సిపాల్టీలకు సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్​ ఆఫీసర్లు సభ్యులతో ప్రమాణ స్వీకారాలు చేయించనున్నారు.