- ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ ‘హస్త’ గతం
- 18 మున్సిపాలిటీలకే పరిమితమైన బీఆర్ఎస్
- కరీంనగర్ మేయర్, నారాయణపేట చైర్‌పర్సన్‌తో కమలం సరి
- పలుచోట్ల మ్యాజిక్ ఫిగర్ కోసం నాటకీయ పరిణామాలు
- ఆదిలాబాద్, భైంసాసహా 4 చోట్ల చైర్ పర్సన్లుగా ఇండిపెండెంట్లు
- బీఆర్ఎస్‌కు 2 చోట్ల కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ సపోర్ట్
- వివిధ కారణాలతో11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లలో ఐదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కీలకమైన నిజామాబాద్‌సహా రామగుండం, మంచిర్యాల,మహబూబ్‌నగర్, నల్గొండ మేయర్ సీట్లను అధికారపార్టీ దక్కించుకున్నది. కొత్తగూడెం మేయర్‌పీఠాన్ని కాంగ్రెస్మద్దతుతో మిత్రపక్షం సీపీఐ అధిరోహించింది. ఇక ఊహించినట్లే కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ ఖాతాలో పడింది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన 105 మున్సిపాలిటీల్లో 81 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే చైర్ పర్సన్స్‌గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్‌కు కేవలం 18 మున్సిపాలిటీలు దక్కాయి. కార్పొరేషన్లలో ఆ పార్టీ ఈసారి జీరోగా మిగిలిపోయింది.
కరీంనగర్ మేయర్, నారాయణపేట చైర్‌పర్సన్‌తో బీజేపీ సరిపెట్టుకున్నది. కాగా, కరీంనగర్‌తోపాటు హంగ్ మున్సిపాలిటీల్లో మ్యాజిక్‌ఫిగర్ కోసం సోమవారం హైడ్రామా నడిచింది. 3 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన కరీంనగర్మేయర్ పీఠం చివరికి బీజేపీ వశమైంది. మీటింగ్‌కు హాజరైన బీఆర్ఎస్కార్పొరేటర్లు తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ గెలుపు సాధ్యమైంది. పలుచోట్ల మ్యాజిక్‌ఫిగర్ కోసం నాటకీయ పరిణామాలు తలెత్తాయి. రెండు చోట్ల కాంగ్రెస్, మూడు చోట్ల బీజేపీ అభ్యర్థుల సపోర్ట్‌తో బీఆర్ఎస్చైర్పర్సన్ స్థానాలను దక్కించుకున్నది. బీఆర్ఎస్సపోర్ట్తో 3 మున్సిపాలిటీల్లో వైస్ చైర్‌పర్సన్ సీట్లను బీజేపీ గెలుచుకున్నది. 4 చోట్ల హంగ్పరిణామాలు ఇండిపెండెంట్లకు కలిసివచ్చాయి. ఈ క్రమంలో తుదికంటా టెన్షన్పెట్టిన ఆదిలాబాద్, భైంసా మున్సిపాలిటీల్లో స్వతంత్రులే చైర్‌పర్సన్స్‌గా ఎంపికయ్యారు. వడ్డేపల్లి మున్సిపాలిటీని సింహం గుర్తుపై పోటీ చేసిన ఏఐఎఫ్ బీ దక్కించుకున్నది. కాగా, వివిధ కారణాలతో 11 మున్సిపాలిటీల పాలకవర్గాల ఎన్నికలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
క్యాంపుల నుంచి నేరుగా మున్సిపాలిటీలకు..
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ నెల 11 ఎన్నికలు జరిగాయి. 13న కౌంటింగ్ అనంతరం విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. కాగా, అదేరోజు రాత్రి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి. సోమవారం అభ్యర్థుల ప్రమాణ స్వీకారంతోపాటు పాలకవర్గాల ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆయా పార్టీల ప్రతినిధులు .. తమ అభ్యర్థులను నేరుగా క్యాంపుల నుంచి ప్రత్యేక బస్సులు, వెహికల్స్‌లో తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఉదయం 10 గంటల వరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. తమకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ బీఆర్ఎస్ లీడర్లు తొర్రూరు, అమన్‌గల్, జనగామ తదితర చోట్ల గొడవ చేశారు. ఎక్స్ అఫీషియో ఓట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముందుగా ప్రమాణ స్వీకారం.. ఆ తర్వాత ఎన్నిక!
మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని చోట్ల పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల అధికారులుగా ఆర్డీవోలు, ఆపై స్థాయి అధికారులకే బాధ్యతలు అప్పగించింది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పేర్లు నమోదు చేసుకున్న ఎక్స్అఫీషియో సభ్యులను మాత్రమే అనుమతించారు. మీటింగ్ హాల్‌లో ప్రతి ఒక్కరి పేర్లు తెలిసేలా పార్టీలవారీగా సీట్లు కేటాయించారు. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించారు. ఒకరు పోటీలో ఉంటే ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు. ఇద్దరు పోటీ పడితే చేతులెత్తే పద్ధతిలో ఓట్లు లెక్కించారు. ఎక్స్ అఫీషియో ఓట్లను కూడా లెక్కలోకి తీసుకున్నారు. ‘వన్ బై థర్డ్’ సభ్యుల కోరం ఉన్న చోటే ఎన్నికలు నిర్వహించామని, వివిధ కారణాలతో 11 చోట్ల పాలకవర్గ ఎన్నికలను వాయిదా వేశామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 7 కార్పొరేషన్లు, 105 మున్సిపాలిటీల్లో గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్స్, వైస్ చైర్‌పర్సన్స్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ప్రతిచోటా పోలీసులు బీఎన్ఎస్ 163 సెక్షన్ అమలు చేశారు. భారీగా పోలీసులను మోహరించి బందోబస్తు చేపట్టారు. అన్నీచోట్లా సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు.
బీఆర్ఎస్‌కు దక్కిన 18 మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలో జీరో..
సోమవారం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్కేవలం 18 చైర్‌పర్సన్ సీట్లను మాత్రమే గెలుచుకున్నది. 7 కార్పొరేషన్లలో ఒక్క చోట కూడా ఆ పార్టీ మేయర్స్థానాన్ని గెలవలేదు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పదికి పది కార్పొరేషన్లను గెలుచుకున్న ఆ పార్టీ ఈ సారి మాత్రం చతికిలపడింది. ఆ పార్టీకి పూర్తిగా బలం ఉన్న 13 చోట్ల చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ సీట్లను బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుచుకున్నారు. మరో ఐదు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో లోకల్ పొత్తులు పెట్టుకొని చైర్‌పర్సన్ పీఠాలను సాధించారు. యెల్లంపేట, అమన్‌గల్, జిన్నారంలో బీజేపీ, ఇస్నాపూర్, అమరచింతలో కాంగ్రెస్ అభ్యర్థుల సపోర్ట్‌తో చైర్‌పర్సన్ పదవులు సాధించారు. ఈ ఐదు చోట్ల వైస్ చైర్మన్ పదవుల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ పార్టీ సహకరించింది.
బీజేపీకి ఖాతాలో కరీంనగర్ మేయర్.. నారాయణపేట చైర్ పర్సన్
రాష్ట్రంలో మొదటి నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన కరీంనగర్ మేయర్ సీటుఎట్టకేలకు బీజేపీ వశమైంది. మొత్తం 66 డివిజన్లకుగాను 30 బీజేపీ, 14 కాంగ్రెస్, బీఆర్ఎస్ 09, ఎంఐఎం 03, ఏఐఎఫ్‌బీ నుంచి ఇద్దరు, మిగతా 8 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. ఈ నెల 13న కౌంటింగ్ పూర్తయ్యినప్పటి నుంచి కరీంనగర్ కార్పొరేషన్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరిగాయి. కీలకమైన స్థానం కావడంతో మేయర్ సీటుపై కాంగ్రెస్ కన్నేసి పోటీలో నిలిచింది. ఎంఐఎం, ఇండిపెండెంట్లు, ఏఐఎఫ్‌బీ అభ్యర్థుల సపోర్ట్‌తో గెలవాలని ప్రయత్నించింది. చివరి సమయంలో బీఆర్ఎస్ తమకు సపోర్ట్ ఇస్తుందని భావించింది. దీంతో మేయర్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది. తీరా ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చింది. ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉండిపోయింది. దీంతో 34 ఓట్లు బీజేపీ అభ్యర్థికి, 21 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రాగా, బీజేపీ క్యాండిడేట్ కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా, మాజీ మేయర్ సునీల్‌రావు డిప్యూటీ మేయర్‌గా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతోపాటు నారాయణపేటచైర్పర్సన్స్థానాన్ని సైతం బీజేపీ గెలుచుకున్నది. వీటితోపాటు బీఆర్ఎస్‌తో పొత్తు కారణంగా జిన్నారం, యెల్లంపేట, అమన్‌గల్ వైస్ చైర్‌పర్సన్ సీట్లనూ కమలం పార్టీ కైవసం చేసుకున్నది.
సీపీఐకి కొత్తగూడెం మేయర్ సీటు..
కొత్తగూడెం మేయర్ సీటును సీపీఐ దక్కించుకున్నది. మున్సిపల్ ఎన్నికలలో ఆ పార్టీ నేతలు మొదటి నుంచి ఈ సీటుపైనే కన్నేసి ప్రచారం చేశారు. 60 కార్పొరేటర్సీట్లకుగానూ సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెరో 22 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ 8 సీట్లకే పరిమితమైంది. దీంతో సీపీఐ, కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్నాయి. చెరో రెండున్నరేళ్లు అనే ఒప్పందంపై కాంగ్రెస్ మద్దతుతో తమ పార్టీ కార్పొరేటర్ ఎం. గణేష్‌ను సీపీఐ మేయర్ సీటుపై కూర్చోబెట్టింది. ఇక్కడ డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన లలిత కుమారి గెలిచారు.
ఆదిలాబాద్ సహా 4 చోట్ల చైర్ పర్సన్స్‌గా ఇండిపెండెంట్లు
మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్, భైంసాతోసహా 4 చోట్ల ఇండిపెండెంట్లు చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో ఆయా పార్టీల తరఫున టికెట్ ఆశించి భంగపడి స్వతంత్రులుగా పోటీ చేసిన వీళ్లకు చైర్‌పర్సన్ ఎన్నికలు కలిసివచ్చాయి. అన్ని పార్టీలు కూడా వీరి నామినేషన్లను బలపరచాల్సి వచ్చింది. ఆదిలాబాద్మున్సిపాలిటీలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది. అయినప్పటికీ ఇతర పార్టీలు, అభ్యర్థుల మద్దతును కూడకట్టలేకపోయింది. బీజేపీ మినహా అన్ని పార్టీలు సహకరించడంతో అనూష చైర్‌పర్సన్‌గా, ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రోహిత్ వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. జమ్మికుంటలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్‌కు మెజారిటీ సీట్లు రాగా, ఇండిపెండెంట్ క్యాండిడేట్ మొలుగు ప్రశాంత్ కుమార్‌ను చైర్ పర్సన్, తమ పార్టీ అభ్యర్థి ముంతాజ్ అలీ ఏడీ మహ్మద్ డిప్యూటీ చైర్‌పర్సన్‌ను చేశారు. మహబూబాబాద్‌లోనూ కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పింది. ఇక్కడ మెజారిటీ సీట్లు రాకపోవడంతో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గుగులోత్ జ్యోతిని చైర్‌పర్సన్, సీపీఎం అభ్యర్థి సున్నపు సోమయ్యను వైస్ చైర్‌పర్సన్‌గా చేయడం విశేషం.
భైంసాలో రెండు పదవులూ ఇండిపెండెంట్లకే..
భైంసాలో 12 సీట్లతో ఎంఐఎం అతి పెద్ద పార్టీగా అవతరించినా.. ఇండిపెండెంట్లకే జైకొట్టారు. మున్సిపల్ చైర్మన్‌గా తుమొల్ల దత్తాత్రి, వైస్ చైర్మన్‌గా బీబీ కుతుజా సిద్ధికి ఇద్రిజ్ ఎంపికయ్యారు. వీరిద్దరూ స్వతంత్ర కౌన్సిలర్లు. బీజేపీ కౌన్సిలర్లు ఆరుగురు, మిగిలిన ఐదుగురు ఇండిపెండెంట్లతో పాటు ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే రామారావుపటేల్ ఓటుతో పదవులు దక్కించుకున్నారు.
ఏడు కార్పొరేషన్లలో ఐదు.. 105 మున్సిపాలిటీల్లో 81 కాంగ్రెస్ వశం!
రాష్ట్రంలో నల్గొండ, మహబూబ్‌నగర్, మంచిర్యాల, రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లను కాంగ్రెస్ ఈజీగా గెలుచుకున్నది. కార్పొరేటర్ల పూర్తి మెజారిటీ ఉండడంతో పరోక్ష ఎన్నికలను సులువుగా గట్టెక్కింది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28 , కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒక చోట గెలిచారు. అత్యధిక స్థానాలు బీజేపీకి ఉన్నా ఇక్కడ ఎంఐఎం మద్దతు, ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ మేయర్ సీటును కైవసం చేసుకున్నది. డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకి అప్పగించిం ది. 105 మున్సిపాలిటీల్లో 81 చోట్ల చైర్‌పర్సన్ పీఠాలను కాంగ్రెస్ గెలిచింది. మెజారిటీ తక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో ఓట్ల సహకారం తీసుకున్నది. వీటిలో పరిగి, మెయినాబా ద్, జగిత్యాలలో ఇండిపెండెంట్లకు డిప్యూటీ చైర్‌పర్సన్ పదవులు అప్పగించింది. ఇస్నాపూర్, అమరచింత మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠానికి బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసి వైస్ చైర్మన్ సీట్లను కాంగ్రెస్ తీసుకుంది.
11 మున్సిపాలిటీల్లో వాయిదా
వివిధ కారణాలతో 11 మున్సిపాలిటీల పాలకవర్గ ఎన్నికలను వాయిదా వేసిన ట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని ప్రకటించారు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీం పట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్న కల్, జనగామ, తొర్రూర్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అప్పుడు కూడా ఎన్నికలు జరగకుండా వాయిదా పడితే రాష్ట్ర ఎన్ని కల సంఘం మరో తేదీని ప్రకటించేంత వరకు పరోక్ష ఎన్నికలు జరగవని కమిషనర్ చెప్పారు.
పార్టీ మేయర్ చైర్‌పర్సన్
కాంగ్రెస్ 05 81
బీఆర్ఎస్ 00 18
బీజేపీ 01 01
సీపీఐ 01 00
ఇండిపెండెంట్లు00 04
