మీరు బీసీల పక్షమా? బీసీ వ్యతిరేకుల పక్షమా? : జాజుల శ్రీనివాస్ గౌడ్

మీరు బీసీల పక్షమా? బీసీ వ్యతిరేకుల పక్షమా? : జాజుల శ్రీనివాస్ గౌడ్
  •     కేసీఆర్‌కు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్  లేఖ 

​హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్  బీసీల పక్షమా? లేక బీసీ వ్యతిరేకుల పక్షమా? తేల్చుకోవాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆయన బీఆర్‌‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు.  బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేసి, రిజర్వేషన్లను అడ్డుకున్న బుట్టెంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ ఇవ్వడం దురదృష్టకరమని మండిపడ్డారు. మాధవరెడ్డి వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులను బీసీలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. 

ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీలాంటి బీసీ బిడ్డల ఆశీస్సులు, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి, కిష్టయ్యలాంటి వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడిన పార్టీ, నేడు బీసీ వ్యతిరేకులకు ఇంధనంలా మారడం చారిత్రక తప్పిదమని లేఖలో విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు గండికొట్టిన మాధవరెడ్డిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, బీసీ సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాలను ముట్టడిస్తామని లేఖలో హెచ్చరించారు.