ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు అర్నబ్ గోస్వామికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా గత సంవత్సరం ప్రసారం చేసిన కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రజలపై ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు రిపబ్లిక్ టీవీ పై బ్రిటిష్ టీవీ రెగ్యులేటరీ అథారిటీ అయిన ఆఫ్‌కామ్ £ 20,000 జరిమానా విధించింది. దీంతో అర్నబ్‌తో పాటు రిపబ్లిక్ టీవీ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
గతేడాది సెప్టెంబర్ 6న టెలికాస్ట్ అయిన ‘పూఛ్‌తా హై భారత్’ అనే కార్యక్రమంలో పాకిస్తాన్ దేశస్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆ సంస్థ ఆరోపించింది. పాక్ లో ఉంటున్న పిల్లలు, వృద్ధులతో సహా అందరూ తీవ్రవాదులే అనే ఉద్దేశ్యం వచ్చేలా అర్నబ్ గోస్వామి వ్యాఖ్యలు చేశారని ఆఫ్‌కామ్ ఆరోపణలు చేసింది. ఆ కార్యక్రమం నిర్వహించిన అర్నబ్‌తో పాటు అందులో పాల్గొన్న సభ్యులు కూడా పాకిస్తానీయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆ సంస్థ తెలిపింది.
దీంతో అర్నబ్ గోస్వామితో పాటు రిపబ్లిక్ టీవీకి జరిమానా విధిస్తున్నట్లు బ్రిటిష్ టీవీ నియంత్రణ సంస్థ తెలిపింది. ఆ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లో మరోసారి ప్రసారం చేయవద్దంటూ ఆఫ్‌కామ్ ఆదేశాలు జారీ చేసింది.
