ఢాకాలో మరోసారి ఉద్రిక్తత.. మైనార్టీలపై దాడులు, వేధింపులు.. భారీ ఎత్తున హిందువుల నిరసనలు

ఢాకాలో మరోసారి ఉద్రిక్తత.. మైనార్టీలపై దాడులు, వేధింపులు.. భారీ ఎత్తున హిందువుల నిరసనలు
  • నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్

ఢాకా: బంగ్లాదేశ్‌‌ రాజధాని ఢాకాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మైనార్టీలపై జరుగుతున్న దాడులు, మతపరమైన వేధింపులను నిరసిస్తూ వేలాది మంది హిందువులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. రంగ్‌‌పూర్‌‌లో నిర్మిస్తున్న అత్యంత పొడవైన శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు తీవ్రవాద ఇస్లామిస్టులు అవమానించారని వార్తలు వెలువడ్డాయి. 

ఉత్తర గాయిబంద జిల్లాలో శ్రీశ్రీ రాధాగోవింద దేవాలయ కమిటీ 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే, అతివాదుల నుంచి బెదిరింపులు రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గాయిబందాలో జరిగిన ఒక ప్రదర్శనలో దుండగులు శ్రీరాముడి చిత్రపటంపై కాళ్లు పెట్టి అగౌరవపరిచినట్టు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

ఈ ఘటనపై హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ మహాజోత్ పిలుపు మేరకు శుక్రవారం వేలాది మంది విద్యార్థులు, హిందూ ప్రతినిధులు ప్రసిద్ధ షాబాగ్ కూడలి వద్దకు చేరుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ, కాగడాలు, కొవ్వొత్తులతో జాతీయ ప్రెస్‌‌క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌‌పీ ప్రభుత్వం మైనారిటీల రక్షణలో విఫలమైందని నిరసనకారులు మండిపడ్డారు. 

నిందితులను అరెస్ట్ చేయడానికి వారు ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం జారీ చేశారు. గడువులోగా చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకవేళ రాముడి విగ్రహ నిర్మాణాన్ని పునఃప్రారంభించనివ్వకపోతే, బంగ్లాదేశ్‌‌లోని 64 జిల్లాల్లో ఒక్కొక్కటిగా రామాలయాలను నిర్మిస్తామని హిందూ మహాజోత్ ప్రతిజ్ఞ చేసింది.