దక్షిణాదిన అత్యధిక ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా హైదరాబాద్ శివారులో రెండు రోజుల పాటు బీజేపీ పార్లమెంట్ విస్తారక్ (ఫుల్ టైమర్స్)ల సమావేశాలకు రంగం సిద్ధమైంది.
హైదరాబాద్, వెలుగు : దక్షిణాదిన అత్యధిక ఎంపీ సీట్లు గెలవడం, తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా హైదరాబాద్ శివారులో రెండు రోజుల పాటు బీజేపీ పార్లమెంట్ విస్తారక్ (ఫుల్ టైమర్స్)ల సమావేశాలకు రంగం సిద్ధమైంది. శామీర్ పేటలోని ఓ రిసార్ట్ లో ఈ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గురువారం జరుగనున్న ముగింపు సమావేశాలకు హాజరుకానున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు గోవా, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, యూపీకి చెందిన కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ విస్తారక్ లు ఇందులో పాల్గొననున్నారు.
మొత్తం 16 రాష్ట్రాలు, రెండు యూటీలకు చెందిన 92 మంది విస్తారక్ లు మీటింగ్ కు అటెండ్ కానున్నారు. పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలి? పార్లమెంట్ నియోజకవర్గాల్లోని బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల పనితీరు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? విస్తారక్ ల బాధ్యతలు, విధులు, తమ పరిధిలోని నాయకులతో సంబంధాలు, సమన్వయంపై దిశా నిర్దేశం చేసేందుకు ఢిల్లీ నుంచి ఆరుగురు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రానున్నారు. రాష్ట్ర సంస్థాగత, రాజకీయ వ్యవహారాల ఇంచార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా సమావేశాల్లో పాల్గొననున్నారు.
రేపు 119 ‘అసెంబ్లీ’ ఇంచార్జీలతో మీటింగ్
రాష్ట్రంలోని119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కన్వీనర్లు, ప్రభారీలు(ఇంచార్జీలు), విస్తారక్ లు, పాలక్ లతో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సంజయ్, ఇతర ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చేపట్టాల్సిన ప్రోగ్రాంలపై ప్లాన్ రూపొందించనున్నారు. బీజేపీ చేరికల కమిటీ సమావేశం కూడా బుధవారం ఇక్కడే జరుగనుంది.
పార్టీలో చేరికలను స్పీడప్ చేయడం, బూత్ నుంచి అసెంబ్లీ స్థాయి వరకు ప్రధాన పార్టీల ముఖ్య నాయకులను చేర్చుకోవడంపై ఇందులో చర్చించనున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కూడా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఫామ్ హౌస్ కేసులో హైకోర్టు తీర్పు వంటి ముఖ్య విషయాలపై చర్చించనున్నారు.

