V6 News

ఇన్ స్పిరేషనల్ స్టార్టప్ ..రైతుల సూపర్ మార్కెట్‌‌!

ఇన్ స్పిరేషనల్ స్టార్టప్ ..రైతుల సూపర్ మార్కెట్‌‌!

మన దేశానికి రైతే వెన్నెముక అంటారు. కానీ.. రైతులేమో పంటకు సరైన ధర లేక నష్టాల పాలవుతున్నారు. మరోవైపు సిటీల్లోని మార్కెట్లలో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. రమేష్ ఈ రెండు సమస్యలను ఎలాగైనా పరిష్కరించాలి అనుకున్నాడు. అందుకే విల్లా మార్ట్‌‌ అనే స్టార్టప్‌‌ని స్థాపించాడు. దీని ద్వారా నేరుగా రైతుల నుంచి కూరగాయలను కొని మొబైల్‌‌ మండీల ద్వారా వాటిని కస్టమర్లకు చేరుస్తున్నాడు. దాంతో రైతులకు లాభాలు, కస్టమర్లకు తక్కువ ధరకే తాజా కూరగాయలు దొరుకుతున్నాయి.

ఒడిశాలోని భువనేశ్వర్​కు చెందిన రమేష్ బిస్వాల్ బాగా చదువుకుని అమెరికాలో సెటిల్‌‌ అయ్యాడు. మంచి సంపాదన, విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ తన దేశం.. ముఖ్యంగా పల్లెటూరి రైతుల గురించే ఆలోచించేవాడు. ప్రతిరోజూ ఇంటర్నెట్‌‌లో రైతులకు సంబంధించిన వార్తలు చూసేవాడు. అలా ఇండియాలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల గురించి తెలుసుకున్నాడు. ఆ రైతుల కథలు అతడిని కలచివేశాయి. 

‘‘మా నాన్నగారు కూడా రైతే. రైతులు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంత కష్టపడతారో చూస్తూ  పెరిగాను. రైతుల ఆత్మహత్యల గురించి వింటుంటే చాలా బాధగా అనిపించేది. అందుకే నా చదువును, జ్ఞానాన్ని నా మాతృభూమి కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుని 2016లో ఇండియాకు తిరిగి వచ్చాను” అన్నాడు రమేష్​. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అతను కొంతమంది ఫ్రెండ్స్‌‌తో కలిసి ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. 

ఎంతో రీసెర్చ్‌‌

రమేష్ ఏసీ గదుల్లో కూర్చుని ప్లాన్స్‌‌ వేయలేదు. రోజూ పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడాడు. అప్పుడే అతనికి వ్యవస్థలోని అసలు లోపం అర్థమైంది. రైతు పండించిన కూరగాయలు మార్కెట్‌‌కు చేరేలోపు ధరలో చాలా తేడా ఉంటోంది. రైతు దగ్గర కిలో కూరగాయలను పది రూపాయలకు కొని, సిటీల్లో వినియోగదారులకు నలభై రూపాయల వరకు అమ్ముతున్నారు. మధ్యలో ఉండే దళారులు శ్రమ లేకుండా లాభాలు గడిస్తుంటే, ఎండనక.. వాననక కష్టపడే రైతుకు మాత్రం కొన్నిసార్లు కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. అందుకే రైతులకు రవాణా ఖర్చులు, మార్కెట్ ఫీజులు, దళారుల కమీషన్ల భారం తగ్గించేందుకు 2017లో రమేశ్​ ‘విల్లా మార్ట్’ను స్థాపించాడు. తమ ప్లాట్‌‌ఫామ్‌‌లో నమోదైన రైతుల నుంచి ధాన్యం, పండ్లు, కూరగాయలను సేకరించి మొబైల్ మండీ ద్వారా సిటీల్లోని కస్టమర్లకు అమ్ముతున్నాడు. 

మొబైల్ మండీ

రైతు తన పంటను మార్కెట్‌‌కు తీసుకెళ్లడం కష్టమైనప్పుడు, మార్కెట్‌‌నే రైతు దగ్గరకు తీసుకెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టిందే ‘మొబైల్ మండీ’. రమేశ్​ ఒక ట్రక్కును చిన్నపాటి మార్కెట్‌‌గా మార్చాడు. ఆ వెహికల్‌‌ ప్రతిరోజూ గ్రామాలకు వెళ్తుంది. పొలం దగ్గరే రైతుల నుంచి పంటను సేకరిస్తుంది. తూకం వేసి, మార్కెట్ కంటే మెరుగైన ధరను అక్కడికక్కడే చెల్లిస్తారు. దీనివల్ల రైతుకు రవాణా భారం, దళారుల వేధింపులు తగ్గాయి. పంట కోసిన వెంటనే చేతికి డబ్బులు అందుతున్నాయి. 

సవాళ్లను దాటి.. 

ఏ కొత్త మార్పునైనా సమాజం అంత త్వరగా అంగీకరించదు. అందుకే రమేష్ ప్రయాణం కూడా మొదట్లో సాఫీగా సాగలేదు. రైతులు రమేష్​ను నమ్మడానికి వెనుకాడారు. పైగా, ఏళ్ల తరబడి రైతుల్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న స్థానిక దళారుల నుంచి బెదిరింపులు, అడ్డంకులు ఎదురయ్యాయి. గ్రామాల్లో సరైన రోడ్లు లేకపోవడం వల్ల వెహికల్స్‌‌ వెళ్లడం కష్టమయ్యేది. కానీ, రమేష్ వెనకడుగు వేయలేదు. రైతులకు నమ్మకాన్ని కలిగించడానికి ఎంతో కష్టపడ్డాడు. క్రమంగా కొందరు రైతులు విల్లా మార్ట్‌‌కు పంటను అమ్మడం మొదలుపెట్టారు. వాళ్లకు గిట్టుబాటు ధర రావడం చూసి తర్వాత ఒడిశాలోని 110 గ్రామాల నుంచి దాదాపు 3 వేల మంది విల్లామార్ట్​లో చేరారు. 

నాణ్యమైన కూరగాయలు 

రైతులకు లాభాలను పంచడంతోపాటు విల్లా మార్ట్ తమ కస్టమర్లకు నాణ్యమైన కూరగాయలను అందిస్తోంది. పొలం నుంచి నేరుగా వచ్చిన కూరగాయలు కావడం వల్ల తాజాగా ఉంటాయి. మధ్యవర్తుల వ్యవస్థ లేకపోవడం వల్ల తక్కువ ధరకే లభిస్తాయి. రమేష్ రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు కూడా మళ్లిస్తున్నాడు. రసాయనాలు లేకుండా పండించడం వల్ల భూమి సారం పెరుగుతుందని అవగాహన కల్పిస్తున్నాడు.

గ్రేడింగ్‌‌.. 

పంటను పొలాల నుంచి ముందుగా వేర్‌‌‌‌హౌజ్‌‌కు తీసుకొచ్చి గ్రేడింగ్‌‌ చేస్తారు. నాణ్యమైన కూరగాయలు, పండ్లను గ్రేడ్ ఏ, బీలో వేస్తారు. వాటిని నేరుగా కస్టమర్లకు అమ్మేస్తారు. గ్రేడ్ సీ, డీలను మాత్రం కస్టమర్లకు ఇవ్వకుండా స్టోర్‌‌‌‌ చేస్తారు. గ్రేడ్‌‌ సీని సోలార్ డ్రైయర్లతో ఆరబెట్టి డ్రైడ్‌‌ వెజిటబుల్స్‌‌లా మారుస్తారు. గ్రేడ్‌‌ డీని మాత్రం కంపోస్ట్‌‌గా మారుస్తారు.