V6 News

సాంబార్ కోసం చంపేస్తావా..! సంగారెడ్డి జిల్లాలో రూ.10 సాంబార్ కోసం లొల్లి.. తల్వార్‎తో దాడి

సాంబార్ కోసం చంపేస్తావా..! సంగారెడ్డి జిల్లాలో రూ.10 సాంబార్ కోసం లొల్లి.. తల్వార్‎తో దాడి

సంగారెడ్డి: కేవలం పది అంటే పది రూపాయిల వివాదం ఓ యువకుడి ప్రాణాల మీదకు వచ్చింది. రూ.10లకు సాంబార్ ఇవ్వనందుకు ఓ వ్యక్తి తల్వార్‎తో వీరంగం సృష్టించాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఓం శ్రీ సాయి కర్రీ పాయింట్ ఉంది. ఇందులో ఉదయ్ (27), అజయ్ (19) అనే అన్నదమ్ములు ఇద్దరు పనిచేస్తున్నారు.

 శనివారం (ఏప్రిల్ 25) రాత్రి మద్యం మత్తులో ఉన్న జీవరత్నం కర్రీ పాయింట్‎కు వెళ్లాడు. తనకు రూ.10 సాంబార్ ఇవ్వాలని అడిగాడు. ఇందుకు వారు నిరాకరించారు. కర్రీ ఏదైనా రూ.30 అని.. 10 రూపాయలకు సాంబార్ ఇవ్వడం కుదరని చెప్పారు. ఈ విషయంలో ఉదయ్, అజయ్‎తో గొడవకు దిగాడు జీవరత్నం. వివాదం మరింత ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జీవరత్నం కర్రీ పాయింట్ షెటర్ మూసేశాడు. 

అనంతరం తన దగ్గర ఉన్న తల్వార్ తో ఉదయ్, అజయ్‎లపై విచక్షణరహితంగా దాడి చేశాడు. అన్నదమ్ములు ఇద్దరు ప్రాణభయంతో కేకేలు వేయగా స్థానికులు వచ్చి కాపాడారు. జీవరత్నం దాడిలో ఉదయ్, అజయ్ తీవ్రంగా గాయపడగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం జీవరత్నం పారిపోయాడు. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి దాడి చేసిన వ్యక్తిని అంబేద్కర్ కాలనీకి చెందిన జీవరత్నంగా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.