V6 News

పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్: నెలకు రూ.10 వేలు దాచుకుంటే రూ.7 లక్షలు మీ సొంతం

పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్: నెలకు రూ.10 వేలు దాచుకుంటే రూ.7 లక్షలు మీ సొంతం

భవిష్యత్తు అవసరాల కోసం.. రూపాయి రూపాయి కూడబెట్టుకునే చేయాలనుకునే మధ్యతరగతి ప్రజలకు పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఎప్పుడూ ఒక భరోసానే. ముఖ్యంగా రిస్క్ లేకుండా.. ప్రభుత్వ గ్యారెంటీతో భారీ లాభాలను అందించే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఇప్పుడు ఇన్వెస్టర్లను బాగా ఆకర్షిస్తోంది. నెలకు చిన్న మొత్తంతో మొదలుపెట్టి.. ఐదేళ్లలో లక్షల రూపాయలను ఎలా వెనకలేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి ఇన్వెస్టర్స్..

సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. కానీ అందరికీ అది సాధ్యం కాదు. అందుకే తక్కువ పొదుపు-ఎక్కువ లాభం అనే సూత్రంతో RD పనిచేస్తుంది. ప్రతి నెలా మీ ఆదాయం నుంచి ఒక నిర్ణీత మొత్తాన్ని పక్కన పెట్టి పోస్టాఫీసులో జమ చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర ప్రభుత్వ భరోసా ఉండటంతో మీ డబ్బుకు పూర్తి రక్షణ ఉంటుంది.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. 
స్కీమ్ మ్యాజిక్ ఏమిటంటే.. కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రస్తుతం ఏప్రిల్-జూన్ 2026 క్వార్టర్ పోస్టాఫీస్ RD పై ఏడాదికి 6.7% వడ్డీ అందించబడుతోంది. ఎవరైనా ఇన్వెస్టర్ ప్రతి నెలా రూ.10వేలు చొప్పున 5 ఏళ్ల పాటు జమ చేస్తే మెుత్తం రూ.6 లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ రూపంలోనే రూ. లక్షా13వేల 659 అదనంగా లభిస్తుంది. అంటే 5 ఏళ్ల గడువు ముగిశాక మీ చేతికి ఏకంగా రూ. 7లక్షల 13వేల 659 అందుతాయి. అయితే రూ.100 కనీస పెట్టుబడితో కూడా ఈ రికరింగ్ డిపాజింట్ ఖాతాను ఓపెన్ చేయెుచ్చు. 

అత్యవసరమైతే అప్పు కూడా..
ఈ స్కీమ్‌లో మరో అద్భుతమైన ఫీచర్ ఉంది. మీరు ఖాతా ప్రారంభించి ఏడాది గడిచిన తర్వాత.. మీ డిపాజిట్ మొత్తంలో 50% వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా లేదా పిల్లల ఫీజులు కట్టాల్సి వచ్చినా ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఐదేళ్ల తర్వాత మీకు కావాలంటే మరో 5 ఏళ్ల కాలానికి స్కీమ్ పొడిగించుకోవచ్చు.

ఎవరికి ఇది బెస్ట్ ఛాయిస్?
జీతం వచ్చే ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, తమ నెలవారీ ఖర్చులు పోను కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవాలి అనుకునేవారికి ఇది సరైన మార్గం. ముఖ్యంగా పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు లేదా సొంత ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యం ఉన్నవారికి RD ఒక గొప్ప ఫైనాన్షియల్ టూల్.

ఖాతా తెరవడం ఎలా?
సమీపంలోని పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేయెుచ్చు. దీనికోసం మీ ఫోటో, పాన్ కార్డ్, ఇతర గుర్తింపు పత్రాలు ఉంటే సరిపోతుంది. అయితే గుర్తింపు కోసం అవసరమైన పత్రాలను సమర్పించేటప్పుడు వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి నెలా సమయానికి డబ్బు జమ చేయడం మర్చిపోవద్దు.. లేదంటే పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది.