ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో యూట్యూబ్‌లో సక్సెస్ కావడమంటే మామూలు విషయం కాదు. కానీ.. రెగ్యులర్‌గా వీడియోలు చేయకపోయినా తన మాట తీరు, ధైర్యసాహసాలతో లక్షలాది మంది గుండెల్లో స్థానం దక్కించుకుంది నిషు తివారి. ప్రాంక్‌లు, చాలెంజ్‌లు, ట్రావెల్ వ్లాగ్స్‌తో ప్రారంభించి.. రియల్ లైఫ్ స్టోరీలతో చానెల్‌కు ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ జర్నీలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి చానెల్‌కు సబ్‌స్క్రయిబర్ల సంఖ్య పెరిగేలా చేసింది.
నిషు తివారి ఢిల్లీలో 1999 డిసెంబర్ 31పుట్టింది. వాళ్లది మధ్య తరగతి కుటుంబం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది. ఆమె 8వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. దాంతో తల్లే ఆమెని పెంచింది. ఆ తర్వాత డిగ్రీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో చేరింది. కానీ.. కాలేజీ రోజుల్లోనే నిషు కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. దాంతో చదువు మానేసి ఉద్యోగంలో చేరింది. ‘‘బాగా చదువుకుని డబ్బు సంపాదించడానికి చాలా టైం పడుతుంది. కానీ.. నాకు ఆ టైంలో డబ్బు చాలా అవసరం. అందుకే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టా” అంటోంది నిషు. ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్‌గా చాలారోజులు పనిచేసింది. అదే టైంలో యూట్యూబ్‌లో వీడియోలు చేయాలనే ఆలోచన వచ్చింది.
మొదటగా ప్రాంక్స్
నిషు 2019లో తన మొదటి యూట్యూబ్ చానెల్‌ని క్రియేట్ చేసింది. అందులో రెగ్యులర్‌గా ప్రాంక్ వీడియోలు చేసేది. మొదట్లో వీడియోలకు పెద్దగా రీచ్ రాకపోయినా కొన్నాళ్లకు వ్యూస్ పెరిగాయి. మూడు సంవత్సరాల్లోనే చానెల్ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 20 లక్షలకు చేరింది. కానీ, కొన్నాళ్లకు నిషుకు ప్రాంక్ ఇండస్ట్రీ వల్గర్‌గా మారినట్టు అనిపించింది. దాంతో రెగ్యులర్‌గా వస్తున్న ఆదాయాన్ని వదులుకుని తన చానెల్‌ను మూసేసింది. ‘‘ప్రాంక్‌లు ఎంటర్‌టైన్ చేస్తాయి. కానీ, దాంతోపాటే మనసుకు బాధ కలిగిస్తాయి. ఒకరి సంతోషం కోసం మరొకరిని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు. అందుకే అలాంటి కంటెంట్ చేయొద్దని డిసైడ్ అయ్యా” అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
కొత్త చానెల్.. కొత్త కంటెంట్
కొవిడ్ లాక్‌డౌన్ టైంలో 2020 జూన్ 3న ‘నిషు తివారి’ పేరుతో మరో చానెల్ పెట్టింది. ఇందులో చాలెంజ్‌లు, ట్రావెల్ అడ్వెంచర్స్, రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లను వీడియో తీసి అప్‌లోడ్ చేస్తోంది. ముఖ్యంగా 24 గంటలు జొమాటో రైడర్‌గా వర్క్, లక్ష స్టెప్స్ వాకింగ్.. లాంటి వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దేశంలోని మిస్టీరియస్ విలేజ్‌ల ట్రావెల్ వ్లాగ్‌లు చానెల్‌ను మరింత పాపులర్ చేశాయి. అంతేకాదు.. ప్రపంచంలో అతి పొడవైన వ్యక్తి, తక్కువ పొడవున్న వ్యక్తితో వీడియోలు చేసింది. ఆమె చేసే చాలెంజ్‌లు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాదు.. ఆమె ధైర్యానికి, సహనానికి నిదర్శనం. ప్రస్తుతం చానెల్‌కు 4.46 మిలియన్ల సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో ఆమెను 1.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు ఆమె సోషల్ మీడియా ద్వారా సుమారు రూ. 4 కోట్ల వరకు సంపాదించిందనేది ఒక అంచనా.
ఎన్నో అడ్డంకులు
నిషుకు యూట్యూబ్ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. “మొదట్లో ప్రతి వీడియోకు కొన్ని రోజులపాటు పనిచేసినా వ్యూస్ వచ్చేవి కాదు” అని చెప్పింది. ఢిల్లీలో ఒక వీడియో షూట్ చేస్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అలాంటివాటన్నింటినీ తట్టుకుని నిలబడింది. చివరకు సక్సెస్ అయ్యింది.
చేసింది కొన్ని వీడియోలే
నిషు యూట్యూబ్ చానెల్ పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు అంటే ఆరేండ్లలో చేసింది కేవలం 196 వీడియోలు మాత్రమే. పైగా వాటిలో ఒక్కటి కూడా షార్ట్ వీడియో లేదు. అయినా.. వేలల్లో వీడియోలు చేసినవాళ్లకు కూడా రాని క్రేజ్ నిషుకు వచ్చింది. ఇప్పటికే వీడియోలకు కోట్ల వ్యూస్ వచ్చాయి. అయితే.. ఆమె షార్ట్ వీడియోల కోసం ప్రత్యేకంగా ‘నిషూ’ పేరుతో మరో చానెల్ కూడా నడుపుతోంది. దానికి 46 వేల మంది సబ్‌స్క్రయిబర్లు మాత్రమే ఉన్నారు. అందులో ఇప్పటివరకు 43 వీడియోలు అప్‌లోడ్ చేసింది.

