V6 News

అటెండర్ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు... లక్షల్లో నగదు.. ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి..

అటెండర్ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు... లక్షల్లో నగదు.. ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి..

ఏపీలో ఓ అటెండర్ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు, లక్షల్లో నగదు పట్టుబడటం కలకలం రేపింది. వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్ గా పనిచేస్తున్న సాదాసీదా ఉద్యోగి 9ఇంట్లో కోట్లాది అక్రమాస్తులు బయటపడటం సంచలనంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో వాణిజ్య శాఖలో అటెండర్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు నివాసంతో పాటు అతని సోదరులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఏకకాలంలో నిర్వహించిన ఈ సోదాల్లో సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు అదికారులు. 

బంగారం, వెండి: 

ఈ సోదాల్లో 760 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 గోల్డ్ బిస్కెట్లు, సుమారు 7.8 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.అంతే కాకుండా వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.22 లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. ఒక ఖరీదైన బహుళ అంతస్తుల భవనం, నగర శివార్లలో విలువైన ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలను కూడా సీజ్ చేశారు అధికారులు.

కేవలం అటెండర్ హోదాలో ఉంటూ ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కూడబెట్టారనే కోణంలో విచారించారు అధికారులు. శ్రీనివాసరావు అధికారుల పేరు చెప్పి వ్యాపారులను బెదిరించి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ ఇంకా ఎక్కువే ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.