
మెల్బోర్న్: పదునైన సర్వీస్‌లు.. బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్.. క్విక్ రిటర్న్స్.. తిరుగులేని ఫోర్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడిన బెలారస్ స్టార్ అరీనా సబలెంక.. ఆస్ట్రేలియన్ ఓపెన్ విమెన్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఐదోసీడ్ సబలెంక 4–6, 6–3, 6–4తో 22వ సీడ్, వింబుల్డన్ చాంపియన్ ఎలెనా రిబకినా (రష్యా)పై గెలిచింది. సబలెంక కెరీర్లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2 గంటలా 28 నిమిషాల మ్యాచ్‌లో బెలారస్ ప్లేయర్ 17 ఏస్‌లు, 51 విన్నర్లు కొట్టింది. ఏడు డబుల్ ఫాల్ట్స్ చేసింది. 13 బ్రేక్ పాయింట్లలో మూడింటిని సద్వినియోగం చేసుకుంది. 9 ఏస్‌లతో సరిపెట్టుకున్న రిబకినా.. ఒక డబుల్ ఫాల్ట్, 31 విన్నర్లు సాధించింది. ఏడు బ్రేక్ పాయింట్లలో కేవలం రెండింటిని మాత్రమే కాచుకుంది. తాజా విజయంతోడబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అరీనా రెండో ర్యాంక్‌ను దక్కించుకునే అవకాశం ఉంది.
తొలి సెట్ చేజారినా...
ఫైనల్ చేరే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోని సబలెంక.. ఫైనల్లో మాత్రం తొలి సెట్‌ను చేజార్చుకుని వెనుకబడింది. 3, 9వ గేమ్స్‌లో సబలెంక సర్వ్‌ను బ్రేక్ చేసిన రిబకినా ఈ సెట్‌ను చేజిక్కించుకుంది. రెండో సెట్లో బేస్‌లైన్ గేమ్‌తో చెలరేగిన అరీనా.. మూడో గేమ్‌లో రిబకినా సర్వ్‌ను బ్రేక్ చేసి, తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకోవడంతో 4–1తో లీడ్‌లోకి వచ్చింది. తర్వాత రిబకినా రెండు సర్వీస్‌లను కాచుకున్నా.. సబలెంక ఎక్కడా చాన్స్ ఇవ్వకుండా తన సర్వీస్‌లను నిలబెట్టుకుంది. దీంతో సెట్ నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో ఇద్దరూ దూకుడుగా ఆడటంతో.. ఓ దశలో 3–3తో సమంగా నిలిచారు. కానీ ఏడో గేమ్‌లో 40–0 వద్ద బ్రేక్ పాయింట్‌ను కాచుకున్న సబలెంక 4–3 ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకోవడంతో లీడ్ 5–3కు పెరిగింది. 9వ గేమ్‌ను రిబకినా నిలబెట్టుకున్నా.. 40–40తో హోరాహోరీగా సాగిన10వ గేమ్ గెలిచిన సబలెంక చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.