ఓల్డ్ మాంక్.. ఈ పేరు వినగానే మందుప్రియులకు గుర్తొచ్చేది ఓ ప్రత్యేకమైన రుచి మాత్రమే కాదు.. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు. కాలేజీ రోజులు, హాస్టల్ గదులు, చలికాలపు సాయంత్రాలు, స్నేహితులతో సాగిన సుదీర్ఘ సంభాషణలు.. ఇలా చాలామందికి ఈ బ్రాండ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అలాంటి ఓల్డ్ మాంక్‌పై ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల వ్యాఖ్యలు ఇప్పుడు మద్యంప్రియుల్లోనే కాదు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.
“ఓల్డ్ మాంక్‌ను రమ్‌గా పిలవచ్చా?” అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. ప్రస్తుత ఫార్ములేషన్, లేబులింగ్ ప్రకారం దీనిని రమ్‌గా విక్రయించలేమని FSSAI బాంబే హైకోర్టుకు తెలిపింది. ఉత్పత్తిలో న్యూట్రల్ స్పిరిట్‌తో పాటు రమ్ ఫ్లేవరింగ్ ఉపయోగిస్తున్నారని రెగ్యులేటర్ వాదించింది. అందువల్ల దీనిని కేవలం రమ్‌గా కాకుండా రమ్-ఫ్లేవర్డ్ స్పిరిట్ గా పిలువాల్సి ఉంటుందని FSSAI కోర్టు తెలిపింది.
ఈ విషయం బయటకు రావడంతో మందుప్రియులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇన్నాళ్లూ తాగింది రమ్ కాదా? అయితే ఓల్డ్ మంక్ ఏంటి? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరు సరదాగా తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటే.. మరికొందరు ఇది నమ్మలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
►ALSO READ | దేశంలోని అన్ని రైళ్లను శుభ్రం చేద్దామా : స్పెషల్ డ్రైవ్ వెనక ఉద్దేశం ఏంటీ..!
ఓల్డ్ మాంక్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని చెబుతూ పలువురు నెటిజన్లు భావోద్వేగ పోస్టులు కూడా పెడుతున్నారు. “నా కాలేజీ జ్ఞాపకాలన్నీ అబద్ధమా?”, “ఓల్డ్ మాంక్ రమ్ కాదంటే ఇన్నేళ్లుగా మేం ఏం తాగాం?” అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.
అంతేకాదు.. ఓల్డ్ మాంక్ బాటిల్‌ను ఉద్దేశించి “హే రమ్!”, “ఇన్నాళ్లూ నిన్ను రమ్ అనుకున్నాం!” అంటూ మీమ్స్ చేస్తున్నారు. దీంతో అసలు వివాదం కంటే.. మందుప్రియుల రియాక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్‌గా మారాయి.
ఇక లేబులింగ్ విషయంలోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. తయారీ సంస్థ ప్యాకేజింగ్‌లో ‘జోడించిన ఫ్లేవర్’ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు, ‘7 Years Old Blended’ అనే వివరణను తొలగించేందుకు అంగీకరించినట్లు సమాచారం. సవరించిన లేబుళ్లను పరిశీలన కోసం సమర్పించారు.
అయితే ఈ వివాదంపై తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. అప్పటివరకు మందుప్రియుల ప్రశ్న మాత్రం ఒక్కటే.. “ఓల్డ్ మాంక్ రమ్ కాకపోతే.. ఇన్నాళ్లూ మా జ్ఞాపకాల్లో ఉన్నది ఏంటి?” ఓల్డ్ మంక్ పై వచ్చిన ఈ నియంత్రణపరమైన వివాదం కంటే.. దానికి మందుప్రియులు ఇస్తున్న రియాక్షన్లే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
