హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి, గంగా–జమున తెహజీబ్‌కు ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్లపై శుక్రవారం గోల్కొండ కోటలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల వాల్‌పోస్టర్లు, బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నగరంలోని బోనాల ఉత్సవాల నిర్వహణకు ముఖ్యమంత్రి రూ.20 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, క్యూలైన్లు, పారిశుధ్యం, తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, రహదారులు, మెట్ల మరమ్మతులు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల కోసం కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు
