- కూతురు కోసం మాజీ ఎంపీ కేకే
- సోనియాను కలువనున్న విజయశాంతి
- రంగారెడ్డి, వరంగల్ ఎమ్మెల్యేలు సైతం
- ఇవాళ (సెప్టెంబర్ 01) ఢిల్లీకి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్
- రేపు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్
- ఎల్లుండి కేసీ వేణుగోపాల్‌తో కీలక భేటీ
- తర్వాత మంత్రివర్గ ప్రక్షాళనపై స్పష్టత
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీ బాటపట్టింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలకు మంగళవారం నుంచి హస్తిన వేదిక కానున్నది. మంత్రివర్గ విస్తరణ ఖాయమనే వార్తల నేపథ్యంలో ఆశావహులు ఢిల్లీ పయనమవుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు రాజధానిలో మకాం వేసి కేబినెట్‌లో బెర్త్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు తరలివెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇటు అధికారిక పర్యటనలు, అటు ముందే ఖరారైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తాజా పరిణామాలు అటు కాంగ్రెస్ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతున్నాయి.
హస్తినలోనే మకాం
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన ముగించుకొని మంగళవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆ వెంటనే ఆయన మంత్రి వర్గ ప్రక్షాళనపై దృష్టిపెడ్తారని చెప్తున్నారు. ఇదే సమయలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం మాజీ సీఎం వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారకార్థం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం రాత్రికి లేదా బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా భోపాల్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. దీంతో రాష్ట్రంలోని కీలక నేతలంతా మంగళవారం నుంచి గురువారం వరకు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. వీరిని కలిసి మంత్రి పదవి కోసం ప్రసన్నం చేసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బాట పడుతున్నారు.
ఇప్పటికే సీనియర్ నేత కేకే ఢిల్లీ వెళ్లి తన కూతురుకు మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్సీ విజయశాంతి కూడా సోనియా గాంధీని కలిసి తన పేరును మంత్రి పదవికి పరిశీలించాలని కోరే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఇక రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపడుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ , హైదరాబాద్ సిటీ నుంచి దానం నాగేందర్, వరంగల్ జిల్లా నుంచి కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పదవి రేసులో ఉన్నారు.
కొండా సురేఖను తప్పిస్తే తమకు అవకాశం ఇవ్వాలంటూ విప్ ఆది శ్రీనివాస్ కోరుతున్నారు. గురువారం కేసీ వేణుగోపాల్‌తో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖపై చర్యల అంశం, మంత్రివర్గ విస్తరణపై చర్చిస్తారని అంటున్నారు. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఈలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేదంటే ఆ తర్వాతా? అనే అంశంపై స్పష్టత రావాలంటే ఈ నెల 3 వరకు ఆగాల్సిందేనని పీసీసీ ముఖ్య నేతలు చెప్తున్నారు.
