
మేడిపల్లి, వెలుగు: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ మండలం కాచవానిసింగారం గ్రామానికి చెందిన ఓ మహిళతో ఏదులాబాద్ గ్రామానికి చెందిన తోటకూర శ్రీనివాస్ కు వివాహం జరిగింది.
తన భార్య స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కిన్నెర జంగయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం శ్రీనివాస్ కు తెలియడంతో మూడుసార్లు కులపెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించి ఇరువరికి నచ్చజెప్పారు. కొన్ని రోజుల క్రితం వివాహిత తమ గ్రామానికి వచ్చి పుట్టింట్లో ఉంటుంది.
జంగయ్య ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో అతడిని చంపాలని శ్రీనివాస్ డిసైడ్ అయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం జంగయ్య టూవీలర్‌పై మేడిపల్లి వైపు వెళ్తుండగా సాయిఐశ్వర్య కాలనీ సమీపంలో శ్రీనివాస్ కారుతో ఢీకొట్టాడు. వెంటనే తన వెంట తెచుకున్న రాడ్‌తో జంగయ్య తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
చనిపోయాడని అనుకుని ఘట్ కేసర్ పోలీస్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తీవ్రగాయలైన జంగయ్యను చికిత్సనిమిత్తం స్థానికులు ఓ ప్రవేటు దవాఖానకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు చెప్పారు.