ఇందిరమ్మ స్కీమ్ లో ఏఈ లదే కీలక పాత్ర : హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతమ్

ఇందిరమ్మ స్కీమ్ లో  ఏఈ లదే కీలక పాత్ర : హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతమ్
  •     వారి సమస్యలు పరిష్కరిస్తాం: హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతమ్

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో అసిస్టెంట్ ఇంజనీర్ల( ఏఈ) పాత్ర ఎంతో కీలకమని హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్ లో అసిస్టెంట్ ఇంజనీర్స్, వర్క్ ఇన్స్ పెక్టర్స్ అసోసియేషన్ 2026 డైరీ, క్యాలండర్ ను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  గౌతమ్ మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో ఇండ్ల నిర్మాణ స్టేజ్ ను బట్టి ఇప్పటివరకు రూ.4 వేల కోట్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు జమ చేశామన్నారు. ఈ స్కీమ్ లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతా లేదా పోస్టాఫీస్ ఖాతాకు బదిలీ చేశామని వివరించారు. 

హౌసింగ్ ఏఈ సమస్యలను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని గౌతమ్ హామీ ఇచ్చారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో  చేయని తప్పులకు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని, హౌసింగ్ శాఖను ఆర్ అండ్ బీలో విలీనం చేశారన్నారు. 

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హౌసింగ్ ను మాతృ శాఖకు తీసుకొచ్చి డిపార్ట్ మెంట్ ను బలోపేతం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతమ్ కు  అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని రవీందర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు వెంకట్రామ్ రెడ్డి, కుమార్, మూర్తి, వెంకన్న, ఆంజనేయులులు, నరసింహరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.