ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఏసీ పేలి 9 మంది మృతి

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఏసీ పేలి 9 మంది మృతి

ఢిల్లీ: ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏసీ పేలుడు కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.

ఢిల్లీ అగ్నిమాపక శాఖ (డీఎఫ్ఎస్) వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. 14 అగ్నిమాపక వాహనాలు, 80 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటలు కష్టపడి ఉదయం 8 గంటల సమయానికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కనీసం తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు DFS అధికారులు తెలిపారు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెకండ్, థర్డ్, ఫోర్త్ అంతస్తులలోని ఫ్లాట్లలో అగ్నిప్రమాదం సంభవించింది. సహాయక, అగ్నిమాపక చర్యల సమయంలో రెస్క్యూ సిబ్బంది.. 10-15 మందిని రక్షించారు. వారిలో స్వల్ప గాయాలైన ఇద్దరిని వైద్య చికిత్స కోసం గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. డీడీఎంఏ సిబ్బంది, ట్రాఫిక్ అధికారులు, స్థానిక పోలీసులతో పాటు పన్నెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలంలో ఉన్నాయి.

స్థానికులు మాట్లాడుతూ.. ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి. సుమారు 12-15 మందిని రక్షించారు. తెల్లవారుజామున 3.13 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 3.35 గంటల ప్రాంతంలో అగ్నిమాపక వాహనాలు వచ్చాయి అని తెలిపారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిసింది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.