హైదరాబాద్ నగరంలో బ్లాక్, బ్లైండ్ స్పాట్స్పై నజర్: సీపీ సజ్జనార్

హైదరాబాద్ నగరంలో బ్లాక్, బ్లైండ్ స్పాట్స్పై నజర్: సీపీ సజ్జనార్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించేలా బ్లాక్ స్పాట్స్, బ్లైండ్ స్పాట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ సజ్జనార్ ఆదేశించారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో బుధవారం ఉన్నతస్థాయి రోడ్డు భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్, హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పాల్గొన్నారు. సజ్జనార్ మాట్లాడుతూ..  రోడ్డు సూచికలు, జీబ్రా క్రాసింగ్స్​, ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ల ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు చేపట్టాలన్నారు. 

రాంగ్ రూట్ లో రోడ్డు క్రాస్ చేసే వెహికల్స్ ను నిరోధించేలా సెంట్రల్ మీడియన్లు, డివైడర్ల ఎత్తు పెంచి గార్డ్ రైలింగ్‌‌‌‌లు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో యాక్సిడెంట్స్ జరిగిన ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ ప్రధాన బ్లాక్ స్పాట్లు, బ్లైండ్ స్పాట్లు ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ..  సంబంధిత శాఖలకు అప్పగించిన పనులపై నిర్ధిష్ట గడువులోగా రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించారు.

 ఆర్టీఏ సభ్యుడు నేతికార్ సురేశ్ లాల్, అడిషనల్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ కమిషనర్ రమేశ్, టీజీఎస్‌‌‌‌ఆర్టీసీ హైదరాబాద్ రీజినల్ మేనేజర్ సుధా పరిమళ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ), రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌‌‌‌ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, స్వచ్ఛంద సంస్థల ఆఫీసర్లు పాల్గొన్నారు.