టిటిడి నిధులపై కాగ్‌తో ఆడిట్‌ చేయించండి: ప్రభుత్వాన్ని కోరిన ధర్మకర్తల మండలి

టిటిడి నిధులపై కాగ్‌తో ఆడిట్‌ చేయించండి: ప్రభుత్వాన్ని కోరిన ధర్మకర్తల మండలి

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిధుల వినియోగంపై కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని టిటిడి ధర్మకర్తల మండలి కోరింది. ఈ మేరకు గత నెల 27 జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ఇకపై ప్రతిఏటా నిధుల వినియోగంపై కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేసేలా తీర్మానం చేసింది. 2014-15 నుంచి 2019-20 మధ్య నిధుల వినియోగంపై రీ ఆడిట్‌ చేయాలని నిర్ణయించింది. గతంలో ఆడిట్ ప్రక్రియను అంతర్గతంగా నిర్వహించేవారు. ప్రభుత్వం అనుమతించిన తర్వాత కాగ్‌ ఆడిట్‌ ప్రక్రియ ప్రారంభించనుంది. నిధుల వినియోగం విషయంలో పారదర్శకత పెంచాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టిటిడి నిధులపై స్వతంత్ర సంస్థలతో ఆడిట్‌ నిర్వహించాలని కోరుతూ ఇప్పటికే న్యాయస్థానాల్లో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో ధర్మకర్తల మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.