ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్స్ అంటే ఏంటి..? ఇవి ఎలా పని చేస్తాయంటే.. 

ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్స్ అంటే ఏంటి..? ఇవి ఎలా పని చేస్తాయంటే.. 

ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన 'సెజ్జిల్' క్షిపణులను ఆదివారం ప్రయోగించిందని ఇరాన్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్షిపణిని ఇరాన్ వాడటం ఇదే మొదటిసారి అని తెలిపింది. సెజ్జిల్ మిసైల్ ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ క్షిపణి. గగనతలంలో ప్రయాణించే తీరును బట్టి దీనికి "డ్యాన్సింగ్ మిసైల్" అనే పేరు కూడా ఉంది. ఇది 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సుమారు 700 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. 

లిక్విడ్ ఇంధన క్షిపణుల కంటే ఘన ఇంధన క్షిపణులను చాలా త్వరగా సిద్ధం చేసి ప్రయోగించవచ్చు. ఇది రాడార్లకు చిక్కకుండా వేగంగా దాడులు చేయడానికి ఉపయోగపడుతుంది. గగనతలంలో దిశను మార్చుకుంటూ ప్రయాణించగలదు. దీనివల్ల ఇజ్రాయెల్ కు చెందిన 'ఐరన్ డోమ్' వంటి గగనతల రక్షణ వ్యవస్థలు దీనిని అడ్డుకోవడం చాలా కష్టమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. 

►ALSO READ | యుద్ధాన్ని వెంటనే ఆపండి... పోప్ లియో-14 పిలుపు 

ఈ యుద్ధంలో ఇరాన్ ఇతర దేశాల కంటే ఎక్కువగా యూఏఈపైనే 1,800కుపైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఇందులో 1,600 డ్రోన్లు, 294 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. ఈ దాడుల్లో ఆరుగురు మరణించగా, 141 మంది గాయపడ్డారు. ఒక్క శనివారమే యూఏఈపైకి 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. 

అయితే, సురక్షిత ప్రాంతం అనే తన ప్రతిష్టను కాపాడుకోవడానికి యూఏఈ ప్రయత్నిస్తోంది. "పుకార్లను ప్రచారం చేయవద్దని", "భద్రతా లేదా కీలక ప్రాంతాలను ఫోటోలు తీయవద్దని" పోలీసులు హెచ్చరించారు. క్షిపణి, డ్రోన్ దాడుల దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు 19 మంది ఇండియన్లు సహా 35 మంది విదేశీయులను యూఏఈ పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల అనంతర దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేసినందుకు బహ్రెయిన్​లోనూ ఆరుగురు అరెస్ట్ అయ్యారు.