మెల్‌బోర్న్: మే 30 నుంచి పాకిస్తాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్‌తో సహా ఇతర క్రీడాకారులు ఐపీఎల్‌లో కొనసాగేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం అనుమతినిచ్చింది. ఐపీఎల్ లీగ్ దశ మే 24తో ముగుస్తుంది. ఫైనల్ మ్యాచ్ మే 31న జరుగుతుంది. కానీ ఆసీస్ జట్టు మే 23నే ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది.
పాట్‌కమిన్స్, ఓపెనర్ ట్రావిస్ హెడ్ (ఎస్ఆర్హెచ్), జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్ (ఆర్సీబీ), జేవియర్ బార్ట్లెట్, మార్కస్ స్టోయినిస్, కూపర్ కానోలీ (పీబీకేఎస్) జట్లు ప్లేఆఫ్ చేరే అవకాశం ఉండడంతో ఇక్కడే ఉండనున్నారు. ఢిల్లీ, కోల్‌కతా నాకౌట్ దశకు చేరుకోకపోతే మిచెల్ స్టార్క్, కెమెరాన్ గ్రీన్ టోర్నీ నుంచి తప్పుకుని పాక్ వెళ్లే అవకాశం ఉంది. లక్నో ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. దీంతో మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ మొదటి వన్డే సమయానికి పాకిస్తాన్‌లోని ఆసీస్ జట్టుతో చేరవచ్చు.
