నింగ్బో (చైనా): ఇండియా షట్లర్ ఆయుష్ షెట్టి బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో వరల్డ్ 25వ ర్యాంకర్ ఆయుష్ 21–13, 21–16తో వరల్డ్ ఏడో ర్యాంకర్ లిన్ షి ఫెంగ్ (చైనా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 51 నిమిషాల మ్యాచ్‌లో ఆరంభంలో ఇండియన్ ప్లేయర్ వెనకబడినా.. తర్వాత పుంజుకున్నాడు.
ఇతర మ్యాచ్‌ల్లో హెచ్.ఎస్. ప్రణయ్ 24–22, 21–12తో ఎంగుయెన్ హాయ్ డాంగ్ (చైనా)పై గెలవగా, కిడాంబి శ్రీకాంత్ 21–18, 9–21, 11–21తో లోహ్ కిన్ యు (సింగపూర్) చేతిలో, లక్ష్యసేన్ 12–21, 19–21తో లి చుక్ యి (హాంకాంగ్) చేతిలో ఓడారు. విమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు 15–21, 21–11, 21–19తో వాంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై, ఉన్నతి హుడా 23–25, 21–8, 21–18తో సుపనిదా (థాయ్‌లాండ్)పై గెలవగా, తన్వీ శర్మ 19–21, 14–21తో కరుపతేవాన్ లెట్షానా (మలేసియా) చేతిలో, మాళవిక బన్సోద్ 10–21, 19–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు.
విమెన్స్ డబుల్స్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా 21–15, 17–21, 21–13తో పామ్ తి డియు–పామ్ తి ఖాన్ (హాంకాంగ్)పై నెగ్గగా, కవిప్రియా సెల్వమ్–సిమ్రన్ సింగ్ 9–21, 8–21తో లి యి జింగ్–లుయో జు మిన్ (చైనా) చేతిలో, అశ్విని భట్–శిఖా గౌతమ్ 10–21, 10–21తో హతైతిపు మిజాద్–తుంగ్‌స్టాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడారు.
