రాష్ట్రవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు
  • 75 చోట్ల పెద్ద జెండాలు
  • సంజీవయ్య పార్కు తరహాలో ఏర్పాటు: కేసీఆర్
  • రాష్ట్రవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు
  • ఈ నెల 12 నుంచి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాలు ఈవెంట్స్ 
  • 12న హైదరాబాద్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం
  • వరంగల్లో కార్యక్రమానికి హాజరు కానున్న గవర్నర్
  • ఉత్సవాల కోసం కమిటీ ఏర్పాటు.. రూ. 25 కోట్ల నిధులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్రం నిర్ణయం ప్రకారం ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట దేశవ్యాప్తంగా జరపనున్న ఉత్సవాలను రాష్ట్రంలోనూ సెలబ్రేట్ చేయనున్నామని చెప్పారు. ఇందుకోసం రూ. 25 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. 2021 మార్చి 12 నుంచి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు  వేడుకలను జరపనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 12 న హైద్రాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో, వరంగల్ పోలీస్ గ్రౌండ్స్లో ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి తాను, వరంగల్లో జరిగే కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమాలను కరోనా రూల్స్కు అనుగుణంగా జరుపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని సంజీవయ్య పార్కులో ఉన్న జెండా తరహాలో రాష్ట్రంలోని 75 ముఖ్యమైన ప్రాంతాల్లో జెండాలు ఎగరేయాలని అధికారులను ఆదేశించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో..
ఆజాదీ కా అమృత్ మహోత్సవాలపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించగా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం ప్రాధాన్యాన్ని, విధి విధానాలను, లక్ష్యాలను ప్రధాని వివరించారు. రాష్ట్రాలు 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ప్రధానితో కాన్ఫరెన్స్ తర్వాత ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సీఎం సమీక్షించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వ్యవహరిస్తారని తెలిపారు. జీఏడీ, ఫైనాన్స్, కల్చరల్, మున్సిపల్, పీఆర్, విద్యా శాఖల కార్యదర్శులు, మున్సిపల్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారని, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ సభ్య కార్యదర్శిగా ఉంటారని, దీనిపై ఉత్తర్వులివ్వాలని సీఎస్ను ఆదేశించారు. పండుగ వాతావరణంలో ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులను స్మరించుకొవాలన్నారు. వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు, కవి సమ్మేళనాలు, నిర్వహించాలని  సీఎం ఆదేశించారు.