అచ్చంపేట ఘటనపై సర్కారు సీరియస్

అచ్చంపేట ఘటనపై  సర్కారు సీరియస్

హైదరాబాద్‌, వెలుగు: ‘అచ్చంపేట’ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఘటనపై సర్కారు సీరియస్​గా స్పందించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. కడుపులోనే బిడ్డ మరణానికి కారణమైన డాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని మెడికల్​ కౌన్సిల్​కు కంప్లైంట్ చేయనున్నట్లు పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్ డాక్టర్​ శ్రీనివాసరావు చెప్పారు. డెలివరీ చేసే టైంలో తల, మొండెం వేరైన విషయాన్ని పేషెంట్‌ కుటుంబ సభ్యులు, అధికారులు, డాక్టర్ల వద్ద దాచినట్టు గైనకాలజీ ప్రొఫెసర్ల కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో డెలివరీలో పాల్గొన్న అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌ సూపరింటెండెంట్, డాక్టర్‌‌ తారాసింగ్‌, మెడికల్ ఆఫీసర్, డాక్టర్ సుధారాణిని సస్పెండ్ చేస్తూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 18న ఉదయం అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌‌కు నొప్పులతో బాధ పడుతున్న గర్భిణి స్వాతిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. రికార్డులను పరిశీలించకుండానే, డెలివరీ కోసం ఆమెను నేరుగా డాక్టర్లు లేబర్‌‌ రూమ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బిడ్డ తల బయటకు వచ్చినట్టు డాక్టర్లు సుధారాణి, తారాసింగ్‌ గుర్తించారు. బిడ్డను బయటకు తీసే క్రమంలో తల వేరైంది. మొండెం కడుపులోనే ఉండిపోయింది. ఈ విషయాన్ని పేషెంట్ కుటుంబ సభ్యులకు, ఉన్నతాధికారులకు తెలపకుండా పేషెంట్‌ను హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అంతకుముందు నెలలో గర్భిణికి చేసిన స్కానింగ్‌లో హైరిస్క్‌ కేసుగా గుర్తించారు. ఈ రికార్డులేవీ పరిశీలించకుండా డెలివరీ చేసేందుకు ప్రయత్నించడం, తల వేరైన విషయాన్ని దాచిపెట్టడం, రిఫర్ చేసి చేతులు దులుపుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పిదమని.. ఈ నేపథ్యంలోనే డాక్టర్లపై చర్యలు తీసుకుంటున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు.