హెచ్ ఐవీ లాగానే రూపంలో మార్పులు
ఎల్ ఆకారంలోకి మారుతున్న ఈ-కొలి, స్టఫైలోకోకస్
హెచ్ఐవీ.. మందులకు లొంగని వైరస్. మందుల ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకునే మహమ్మారి వైరస్. ఇప్పుడు కొన్ని బ్యాక్టీరియాలూ ఆ వైరస్ బాటలోనే వెళుతున్నాయంటున్నారు సైంటిస్టులు. కొందరు పేషెంట్లను పరిశీలించిన తర్వాతే సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు. న్యూకెజిల్ యూనివర్సిటీ సైంటిస్టుల స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ–కొలి, స్టఫైలోకోకస్ వంటి బ్యాక్టీరియాలు యాంటీ బయాటిక్స్‌కు లొంగకుండా ఉండేలా రూపాన్ని మార్చుకుంటున్నట్టు గుర్తించారు. మామూలుగా బ్యాక్టీరియాలోని సెల్ వాల్ (కణ త్వచం)ను టార్గెట్ చేసి యాంటీబయాటిక్స్ పనిచేస్తుంటాయి. కానీ, సెల్వాల్ ఏదో యాంటీబయాటిక్‌లు తెలుసుకోలేకుండా బ్యాక్టీరియాలు ‘ఎల్ ఆకారం’లోకి మార్చేసుకుంటున్నాయి. అదే వాటికి యాంటీ బయాటిక్‌ల నుంచి కాపాడే ‘ప్రూఫ్’లా ఉంటోందని సైంటిస్టులు చెబుతున్నారు.
ఎల్ షేప్‌లోకి బ్యాక్టీరియా సెల్వాల్ మారిపోవడం వల్ల యాంటీ బయాటిక్‌లు బ్యాక్టీరియాను గుర్తించలేకపోతున్నాయని, ఫలితంగా బ్యాక్టీరియా మరింత రాటుదేలుతోందని తెలుసుకున్నారు. న్యూకెజిల్ ఫ్రీమాన్ హాస్పిటల్‌లోని రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించి యాంటీ బయాటిక్‌లు ఇచ్చి పరీక్షించారు. అందులో 99 శాతం రోగుల రక్తంలోని బ్యాక్టీరియాలు రూపాన్ని మార్చుకున్నట్టు గుర్తించారు. యాంటీ బయాటిక్ ప్రభావం తగ్గిపోయాక ఆ బ్యాక్టీరియాలు ఐదు గంటల్లో మళ్లీ మామూలు రూపంలోకి మారి మాయ చేస్తున్నాయని తేల్చారు.
అంతేకాదు, రోగ నిరోధక వ్యవస్థకు ఈ బ్యాక్టీరియాలను ఎక్స్పోజ్ చేసినప్పుడు కూడా బ్యాక్టీరియాలు ఎల్ ఆకారంలోకి మారినట్టు గత పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎల్ ఆకారంలోకి బ్యాక్టీరియా మారినా, రోగి రోగనిరోధక వ్యవస్థ గట్టిగా ఉంటే దాని ప్రభావం ఏమీ ఉండదని, బలహీనమైన వారిలోనే దాని వల్ల ముప్పు ఉంటుందని సైంటిస్టులు గుర్తించారు. అలాంటి వాళ్లలో అప్పటికే ఒక ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎల్ షేప్‌లోకి మారడం వల్ల కొత్త ఇన్ఫెక్షన్ వస్తుందంటున్నారు.
