టాలీవుడ్ ప్రేక్షకులకు తనదైన కామెడీతో వినోదాన్ని పంచి అల్లరోడుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేశ్. గత కొంతకాలంగా రూటు మార్చిన ఈ యంగ్ హీరో సీరియస్ కథాంశాలతో మెప్పిస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘కనక దుర్గ’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. విలక్షణమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా అధికారికంగా పట్టాలెక్కింది.
మెగా ఫ్యామిలీ ఆశీస్సులతో..
ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. మెగా కుటుంబం తరఫున వచ్చిన ఈ మద్దతు చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే, ఈ వేడుకలో టాలీవుడ్ మహిళా పవర్‌ను ప్రతిబింబించేలా పలువురు సినీ ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం విశేషం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని, కుమార్తె హన్షిత రెడ్డి, స్వప్న దత్ , అల్లరి నరేశ్ భార్య విరూప ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమా ప్రారంభోత్సవ క్లాప్ కొట్టి చిత్ర బృందానికి విషెస్ తెలిపారు..
సరికొత్త కోణంలో అల్లరి నరేశ్
‘కనక దుర్గ’ అనే టైటిల్ వినగానే ఇదొక శక్తివంతమైన రివెంజ్ డ్రామా లేదా ఎమోషనల్ యాక్షన్ మూవీ అనే భావన కలుగుతోంది. ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నరేశ్, ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’ వంటి సినిమాలతో తనలోని తీవ్రతను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పుడు ‘కనక దుర్గ’ ద్వారా నటుడిగా మరో మెట్టు ఎక్కబోతున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. కథలో కంటెంట్ బలంగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
హిట్ కొట్టాల్సిందే!
నిజానికి గత కొంతకాలంగా అల్లరి నరేశ్‌కు సరైన కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. ఆయన ఎంచుకుంటున్న కథలు వినూత్నంగా ఉన్నా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టి తన సత్తా చాటాలని నరేశ్ పట్టుదలతో ఉన్నారు. దర్శకుడు ప్రదీప్ మద్దాలి కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
►ALSO READ | బాక్సాఫీస్ వద్ద శర్వానంద్ 'బైకర్' స్పీడ్.. రెండో రోజు వసూళ్లు ఇవే.!.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ త్వరలో ఇతర నటీనటులు ,సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. ప్రారంభ దశలోనే ఇంతటి పాజిటివ్ వైబ్స్‌ను సొంతం చేసుకున్న ‘కనక దుర్గ’, అల్లరి నరేశ్ కెరీర్లో ఒక మలుపు తిప్పే చిత్రమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రాండ్ లాంచ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
